ఆంధ్రాకు వస్తావా? రా.. దమ్ముంటే చూసుకుందాం

 

నందమూరి బాలకృష్ణ.. మలక్‌పేట ప్రజాకూటమి టీడీపీ అభ్యర్థి మహ్మద్‌ ముజఫర్‌ అలీఖాన్‌తో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మీద తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ మీద చంద్రబాబు తనదైన ముద్ర వేశారన్నారు. ఏదో నాలుగు గొర్రెలను తీసుకొచ్చి మేమేదో చేసామంటే కుదరదన్నారు. ‘చంద్రబాబు బుద్ధిగా ఆయన పని ఆయన చేసుకునేటోడు. అసలు ఏడ్చేటోడు కానేకాదు. పక్కా ఢిల్లీ, గల్లీలో వేలు పెట్టేవాడు కాదు. విదేశాల్లో గల్లీ గల్లీ తిరిగి పెట్టుబడులు రాబట్టే వాడు మన చంద్రబాబు’ అని అన్నారు. ఫాంహౌస్ కు పోయి పండేటోడు కానేకాదన్నారు.

కేసీఆర్‌ది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అని అన్నారు. ‘కేసీఆర్‌ ఎంతో మందిని ఏదో చేస్తానన్నాడు. దళితుడిని సీఎం చేస్తానన్నాడు.. చేసిండా? గిరిజనులకు 3 ఎకరాల భూమి అన్నాడు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అన్నాడు. బట్టేబాజ్‌ మాటలు చెప్పిండు’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పుకుంటారు సీఎం కేసీఆర్‌?. సెక్రటేరియట్‌కు రాలేకపోయానని, మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని రూ.2లక్షల కోట్ల అప్పులు చేసిన మోసగాడినని చెప్పుకుంటారా? ’ అంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రలో జరగబోయే ఎన్నికల్లో వేలు పెడతానంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. ‘ఆంధ్రాకు వస్తావా? రా.. దమ్ముంటే చూసుకుందాం’ అంటూ సవాల్‌ విసిరారు. అయినా ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఆంధ్రా ప్రజలకు అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలు కూడా వారితో కలిసి ఉద్యమిస్తారంటూ హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే ఆంధ్రా ప్రజలూ తిరగబడతారన్నారు.