మాజీ సీఎం ఫ్యామిలీపై టీడీపీ "కన్ను"

రాష్ట్ర విభజన పేరిట కాంగ్రెస్ అధినాయకత్వం చేసిన ఘోరమైన రాజకీయ తప్పిదం ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసింది. అంతేకాకుండా తరాల పాటు కాంగ్రెస్ సేవ చేస్తూ వచ్చిన ఉద్దండుల రాజకీయ భవిష్యత్‌ అంధకారంలో పడింది. అలాంటి వారిలో నల్లారి కుటుంబం ఒకటి. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి..ఆయన తండ్రి దివంగత మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి భారత మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితంగా మెలిగారు. తండ్రి మరణం తర్వాత ఆయన వారసుడిగా కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. 1989లో జరిగిన ఎన్నికల్లో వాయల్పాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు. ఆ తరువాత 1999, 2004, 2009ల్లో శాసనసభ్యుడిగా గెలిచారు.

 

స్వర్గీయ వైఎస్‌కు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు సంపాదించారు..2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు. అయితే వైఎస్ మరణం తర్వాత పార్టీలోనూ..ప్రభుత్వంలోనూ తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో సీనియర్ రాజకీయ వేత్త రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది కాంగ్రెస్ . అయితే వయసు రీత్యా పెద్దాయన తప్పుకోవడంతో కిరణ్‌ను సీఎం పదవి వరించింది. రాష్ట్ర విభజనను తీవ్రంగా ఎదుర్కొన్న ఆయన..చివరి వరకు ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ పరిస్థితి చేయి దాటి పోవడంతో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. కానీ ఆ ఎన్నికల్లో ఈ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు కావడంతో కిరణ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.

 

అయితే ఆయన మనసు మార్చుకున్నారని..తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది..మచ్చలేని వ్యక్తిగా..సమర్థుడిగా పేరు తెచ్చుకున్న నల్లారిని పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ, వైసీపీ తీవ్రంగా ప్రయత్నించినట్లు వార్తలు వినిపించాయి. కాని నేటి వరకు అవి పుకార్లుగానే ఉండిపోయాయి. 2019 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్టం చేసే ప్రణాళికలో ముందుకు సాగుతున్న టీడీపీ అధిష్టానం కన్ను నల్లారి కుటుంబంపై పడింది. చిత్తూరు జిల్లాలో బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నల్లారి కుటుంబం టీడీపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని లోకేష్ భావిస్తున్నారట.

 

ఇప్పటికే ముఖ్యనేతల ద్వారా లోకేష్ నల్లారి ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నారట. ఈ నేపథ్యంలో కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. టీడీపీలో చేరే విషయంపై కిషోర్ తన ముఖ్య అనుచరులతో మంతనాలు సాగించి మరి కొద్దిరోజుల్లోనే తుది నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయట. ఇదే విషయాన్ని తన అన్న కిరణ్‌‌తో కూడా చర్చించి ఆయన సలహా మేరకు నడుచుకునే ఉద్దేశ్యంలో ఉన్నారట. మరోవైపు తమ్ముడి పరిస్థితి సరే కిరణ్‌కుమార్ రెడ్డి సంగతి ఏంటి అనే డౌట్ రావొచ్చు. ఇక్కడే మాజీ సీఎం వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారట..ముందుగా తన తమ్ముడిని అధికార టీడీపీలోకి పంపి..తర్వాత..పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్న తర్వాతే..అంటే 2019 ఎన్నికల నాటికి పచ్చజెండా కప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.