నల్గొండలో అఖిలపక్షం దోపిడీ
posted on Apr 21, 2012 10:27AM
రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా అధికారవిపక్షాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఒకరో లోగుట్టును మరొకరు బయటపెడుతున్నారు. నల్గొండ జిల్లాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి నాయకులు పలువ్యాపారాలు కలిసికట్టుగా చేసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా కోట్లాదిరూపాయలు ఆర్జిస్తున్నారు. ఇక మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు కాంట్రాక్టులు కూడా వీరంతా కలిసే చేస్తూ సామరస్యంగా సహజీవనం చేస్తున్నారు. పార్టీలన్నీ ఏకంకావటంతో వారు ఎన్ని నిబంధనలు ఉల్లంఘించినా, ఎంత దోపిడీ చేసినా ఆ వివరాలు బయటకు రావటం లేదు.
నల్లగొండ నియోజకవర్గంలో ఒక అధికారపార్టీ నాయకుడు, టిడిపి రాష్ట్రస్థాయి నాయకుడు కలిసి సుమారు 40 రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తున్నారు. వీటిలో వేటికీ సరైన అనుమతులు లేవు. వారిని ప్రశ్నించేవారు కూడా ఎవరూ లేకపోవటంతో వీరి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. టిడిపికి చెందిన ఒక జిల్లా నాయకుడికి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీమంత్రికి మధ్య వ్యాపారలావాదేవీలున్నాయి. వీరిద్దరూ కోట్లాది రూపాయల విలువైన సివిల్ కాంట్రాక్టులతో పాటు సుమారు 60 మద్యం షాపుల్లో భాగస్వాములుగా ఉన్నారు. మిర్యాలగూడలో మద్యం సిండికేట్, రియల్ ఎస్టేట్ సిండికేట్లలో కాంగ్రెస్, టిడిపిలతో పాటు బిజెపి నాయకులు భాగస్వాములుగా కొనసాగుతున్నారు. అలాగే కోదాడమ్ నేలచెరువు, నేరేడుచర్ల, సుదూర్ నగర, సూర్యాపేట, అరవపల్లి, నూతనకల్, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో ఈ మూడు పార్టీల నాయకులు ఏకమై గుట్టుచప్పుడు కాకుండా అనేక వ్యాపారాలు చేస్తూ కోట్లాదిరూపాయలు ఆర్జ్హిస్తున్నారు.