ఆ ఫ్యామిలీలో మరణాలు..ఎప్పటికీ మిస్టరీనేనా..?

ఒక కుటుంబంలో నెలల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే..బంధుమిత్రులు, గ్రామస్తులు ఆఖరికి గవర్నమెంట్ కూడా మరణానికి కారణం తెలుసుకోలేకపోతే..ఇది ఎక్కడో జరిగింది కాదు..మనదేశంలోనే. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తందరాయ్‌లో ఓ కుటుంబంలో వరుస మరణాలు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. 2016 అక్టోబర్ 7న మొదలైన మరణాల పరంపర నేటికి ఆగలేదు. ఆ రోజున క్రిస్టోఫర్ అనే 13 ఏళ్ల బాలుడు మృతి చెందగా ఆ తర్వాత వినోద్ కుమార్, నెల్సన్, క్రితికా మెర్లిన్, జోసెఫ్, క్రిస్టినా వాంతులు చేసుకుని మరణించారు. తాజాగా సరాన్ అనే 4 సంవత్సరాల బాలుడు తిరువణ్ణామలై ఆస్పత్రిలో‌ చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచాడు. జ్వరంతో సరాన్ మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడని..ఆదివారం ఉదయం వరకు బాలుడి పరిస్థితి బాగానే ఉందని..కానీ ఆ తర్వాత పరిస్థితి విషమించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు..అయితే ఆ కుటుంబంలో మాత్రమే ఎందుకు వరుసగా చనిపోతున్నారన్న విషయంపై మాత్రం కలెక్టర్ సమాధానం చెప్పలేదు. గ్రామస్తులు మాత్రం ఆ ఫ్యామిలీ మీద ఎవరో గిట్టని వారు ప్రయోగం చేశారని...రకరకాలుగా చర్చించుకుంటున్నారు.