5న తెలంగాణకు నైరుతి.. ఇక వానలే వానలు
posted on Jun 1, 2022 6:24AM
నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని మూడు రోజుల ముందే తాకినా.. అవి తెలంగాణలోకి ప్రవేశించడానికి మాత్రం మరో ఐదు రోజులు పడుతుంది. ఈ నెల 5 రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్ష పాతం నమోదౌతుందని అంచనా వేసింది.
ఏప్రిల్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ప్రకటించిన ఐఎండి ఇప్పుడు దానిని సవరించుకుంది. ఈ ఏడాది సగటు వర్షపాతం 103శాతం ఉంటుందని పేర్కొంది. రుతుపవనాల విస్తరణకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని, అవి చురుగ్గా కదులు తున్నాయనీ వివరించింది. దేశంలో ఈశాన్య ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన అన్న ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదౌతుందని వివరించింది.
దేశంలోని వ్యవసాయానికి నైరుతి రుతుపవనాలు అత్యంత ముఖ్యమన్న సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. అయితే ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
అయితే తాజాగా భారత వాతావరణ శాఖ ఈ రుతుపవనాల సీజన్‌లో ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న తీపి కబురును అందించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వేసవి ప్రతాపం తగ్గడంతో జనం ఉపశమనం పొందుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడింది.