ఫాస్ట్ బౌలర్ షమీ నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం!!

 

ఈ వరల్డ్ కప్ లో కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడి, ఏకంగా 14 వికెట్లు తీసిన భారత ఫాస్ట్‌ బౌలర్ షమీని, సెమీఫైనల్ మ్యాచ్ లో పక్కన బెట్టడంపై షమీ కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు మేనేజ్ మెంట్ ఫాస్ట్ బౌలర్ల నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తోందో తెలియడం లేదని విమర్శించారు.

"నాలుగు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన వ్యక్తిని ఎలా పక్కన పెట్టగలరు? మీ ఫాస్ట్‌ బౌలర్స్‌ నుంచి ఇంతకంటే మీరేం ఆశిస్తున్నారు? భువనేశ్వర్‌ బ్యాటింగ్‌ కూడా చేయగలడని అతడిని ఎంచుకున్నారన్న వాదన నిజమైందేనా? అయితే టాప్‌ 6 బ్యాట్స్‌మన్‌ బాగా ఆడినట్లయితే మిగతా వారితో పనేముంది? అసలు అది సరైన కారణమని ఎవరనుకుంటారు? మ్యాచ్‌లో షమీ పని బాల్‌తో ఆడి ఆటను గెలిపించడమే. బ్యాట్‌తో షమీకి ఏం పని? టోర్నమెంట్‌ మొదట్లో అవకాశం ఇవ్వలేదు కాబట్టే తర్వాతి మ్యాచ్‌ల్లో తనేంటో నిరూపించుకున్నాడు" అని తెలిపారు.

మరోవైపు.. భార‌త్, న్యూజిలాండ్ మ‌ధ్య సెమీ ఫైన‌ల్ మ్యాచ్ మ‌ధ్య‌లో ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. రిజ‌ర్వ్ డే ఉండ‌డంతో మంగ‌ళ‌వారం మ్యాచ్ ఎక్క‌డైతే ఆగిందో బుధ‌వారం అక్కణ్నుంచే ప్రారంభ‌మ‌వుతుంది. అయితే బుధ‌వారం కూడా ఈ మ్యాచ్‌ను వ‌రుణుడు స‌జావుగా సాగ‌నిచ్చేలా లేడు. బుధ‌వారం కూడా మాంచెస్ట‌ర్‌లో భారీ వ‌ర్షం కురుస్తుంద‌ని వాతావార‌ణ శాఖ వెల్ల‌డించింది. ఏక‌ధాటిగా కాక‌పోయినా మ్యాచ్‌కు వ‌ర్షం ప‌లుసార్లు అంత‌రాయం క‌లిగిస్తుంద‌ట‌. రోజంతా ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని, భార‌త కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 4:30 గంట‌ల‌కు, రాత్రి 9:30 గంట‌ల‌ స‌మ‌యంలో భారీ వ‌ర్షం కురుస్తుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది.