ముఖ్యమంత్రి దర్శనం మహాభాగ్యం!!

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం ఎంత కష్టం?. మనలాంటి సామాన్యులు అయితే ముఖ్యమంత్రిని కలవడం దాదాపు అసాధ్యం. ఒకవేళ అనుకోకుండా కలిస్తే అది మన అదృష్టం అనుకోవడమే. అయితే, ఆంధ్రప్రదేశ్ లో సామాన్యులకు మాత్రమే కాదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కూడా ముఖ్యమంత్రిని కలవాలంటే అదృష్టం ఉండాలనే అభిప్రాయముంది. సీఎం వైఎస్ జగన్ ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళని పిలిపించి మాట్లాడటమే తప్ప.. ఎవరైనా ప్రజాప్రతినిధి ఏదైనా విషయమై సీఎంని కలవాలనుకుంటే ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకదు అంటుంటారు. దీంతో ముసలోడికి దసరా పండగ అన్నట్టు.. ముఖ్యమంత్రి ఏదైనా కార్యక్రమానికి హాజరైనప్పుడు కలవొచ్చు.. అదే తమ అదృష్టం అన్నట్టు చెప్పుకుంటారు కొందరు. కానీ, నిజానికి మెజారిటీ ప్రజాప్రతినిధులకు ఆ అదృష్టం కూడా లేదనే చెప్పాలి.

 

సీఎం జగన్ ఏదైనా అధికారిక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఏదో ఒకరిద్దరు తప్ప మిగతా ప్రజాప్రతినిధులంతా ప్రేక్షక పాత్రకే పరిమితమవుతుంటారు. తాజాగా గోపూజ మహోత్సవంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వంటి వారు ఉన్నారు. ఇక మిగతా ప్రజాప్రతినిధులు ఏదో దూరపు బంధువుల పెళ్ళికి వచ్చినట్టు దూరందూరంగా ఉండాల్సిది వచ్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు విడదల రజిని, అంబటి రాంబాబు వంటి వారికి కూడా సెక్యూరిటీని దాటుకొని వెళ్లి.. సీఎం కి షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు మాట్లాడటమే కష్టమైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

మాములు సమయాల్లో ఎలాగూ సీఎం ఎవరికీ అంత తేలికగా అపాయింట్మెంట్ ఇవ్వరు. ప్రజాపతినిధులకు క్షణాల్లో తిరుమల శ్రీవారి దర్శనం అవుతుంది కానీ.. రోజుల తరబడి ఎదురుచూసినా సీఎం దర్శనమవ్వడం మాత్రం కష్టమనే అభిప్రాయముంది. మరి అలాంటప్పుడు కనీసం ఏదైనా అధికార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడైనా.. ఆ జిల్లాకు చెందిన స్థానిక ఎమ్మెల్యేలకు దర్శనం ఇవ్వాలి కదా. అబ్బే లేదు. ఇలా అయితే ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను సీఎం దృష్టికి ఎలా తీసుకెళ్లగలరు?.. అసలు గ్రౌండ్ రియాలిటీ సీఎంకి ఎలా తెలుస్తుంది?.. ప్రజాప్రతినిధులకే సీఎంని కలవడం మహాభాగ్యమైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటూ సీఎం తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఇకనైనా తన తీరుని మార్చుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.