ఓట్లతో గెలిచిన వారి ప్రవర్తన ఓవర్ అవుతోందా?

 

ఎమ్మెల్యే కలెక్టర్ కన్నా గొప్పా? లేక కలెక్టరే ఎమ్మెల్యే కన్నా పవర్ ఫుల్లా? ఇది చెప్పటం చాలా కష్టం! ఎందుకంటే, ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధి. జనం ఓట్లతో వచ్చిన వాడు. కాని, కలెక్టర్ తన సర్వీస్ మొత్తం పూర్తయ్యేదాకా జనం బాగోగులు చూసే ఉన్నతాధికారి! కాబట్టి వీరి మధ్యా ఎవరు గొప్పా, ఎవరు ఎక్కువ శక్తివంతులు అని తేల్చలేం! కాని, చాలా సార్లు ప్రజా ప్రతినిధులకి , అధికారులకి వ్యవహారం చెడుతుంటుంది. అప్పుడు న్యూస్ బయటకి వచ్చినా రాకున్న గందరగోళం మాత్రం సాగుతూనే వుంటుంది! మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ ప్రతీ మీనా గొడవ అలాంటిదే!

 

అధికార పక్షం ఎమ్మెల్యే అంటే రాష్ట్రంలో తిరుగుండదు. ఇక తన స్వంత నిజయోజక వర్గంలో అయితే అడిగే వారే వుండరు! ఇది ఒకప్పటి మాట. కాని, ఇప్పుడు పరిస్థితులు మెల్లమెల్లగా మారుతున్నాయి. ఎంత ఎమ్మెల్యే అయినా, ఎంత ఎంపీ అయినా తప్పు చేస్తే క్షమాపణలు చెప్పుకోక తప్పటం లేదు. హరిత హారం కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ మీనాతో అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను చేతితో ముట్టుకుని ముందుకు కదలమన్నారు. ఆ ప్రవర్తనతో ఆమె మనస్తాపానికి గురై ఐఏఎస్ ల సంఘానికి ఫిర్యాదు చేసింది. క్షణాల్లో వ్యవహారం సీఎం కేసీఆర్ దాకా వెళ్లింది. ఆయన ఫోన్ లో గట్టిగా చెప్పటంతో శంకర్ నాయక్ కలెక్టర్ కి క్షమాపణ చెప్పారు!

 

శంకర్ నాయక్ సారీతో గొడవ సద్దుమణుగుతుందని అంతా భావించారు. కాని, కలెక్టర్ శాంతించక పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంతో ఎమ్మెల్యే అరెస్ట్ కావాల్సి వచ్చింది. బెయిల్ మీద బయటకొచ్చినా ముందు ముందు శంకర్ నాయక్ కోర్టుకు వెళ్లక తప్పని పరిస్థితి. అసలింతకీ కలెక్టర్ మీనా సారీ చెప్పినా ఎందుకు పట్టువీడలేదు? అందుక్కారణం.. ఎమ్మెల్యే ఆమెని ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి కాదంటున్నారు! కొన్నాళ్లుగా కలెక్టర్ కి, ఎమ్మేల్యేకి పొసగటం లేదట. అందుకే, పబ్లిగ్గా కెమెరాకి చిక్కినప్పుడు కలెక్టర్ మీనా శంకర్ నాయక్ పై కేసు పెట్టారని చెబుతున్నారు! ఇక ఇప్పుడు కేసీఆర్ శంకర్ నాయక్ ని పార్టీలో వుంచుతారా? లేక సస్పెండ్ ఏమైనా చేస్తారా చూడాలి…

 

తెలంగాణలోనే కాదు…. ఆ మధ్య ఏపీలోనూ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇలాగే నడిచింది. అక్కడా ఉన్నతాధికారితో అధికార పార్టీ ప్రజాప్రతినిధి కటువుగా వ్యవహరించారు. అందుకు సీరియస్ గా స్పందించిన చంద్రబాబు సారీ చెప్పించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అధికారి వైపే మొగ్గు చూపారు. తప్పు ఎవరి వైపున వున్నా… బాధ్యత గల శాసనసభ్యులు, పార్లెమెంట్ సభ్యులు అధికారులతో హుందాగా వ్యవహరించాల్సిందే! లేదంటే… ఎయిర్ పోర్టుల్లో సహనం కోల్పోయిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్, మన జేసీ లాగా అనవసర కాంట్రవర్సీల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది!