మాజీ ఎంపీ కొంగులాగిన ఎమ్మెల్యే

 

మధ్యప్రదేశ్‌లో దినేష్ రాయ్ అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చాలా చిలిపి వాడని పేరు. అయితే తన చిలిపితనాన్ని ఓ మాజీ లేడీ ఎంపీ దగ్గర చూపించి అడ్డంగా దొరికిపోయాడు. సియోన్ నియోజకవర్గంలో జరిగిన ఓ బహిరంగసభలో బీజేపీ మాజీ ఎంపీ నీతా పటేరియాతో కలసి పాల్గొన్న దినేష్‌రాయ్ ఆ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన చేతికి నూనె అంటుకుంది. దాంతో సదరు ఎమ్మెల్యేగారు అటూ ఇటూ చూసి, తనని ఎవరూ గమనించడం లేదనుకుని నీతా పటేరియా కొంగు లాగి తన చేతిని ఆమె చీరకి తుడిచేశాడు. దీనిని ఓ స్థానిక ఛానల్ కెమెరా కనిపెట్టేసి ప్రసారం చేసేసింది. దాంతో నాలుక్కరుచుకున్న దినేష్‌ రాయ్ నీతా పటేరియా దగ్గరకి వెళ్ళి సారీ చెప్పాడు. కొంగు లాగడం వెనుక తనకు వేరే ఉద్దేశాలేవీ లేవని, మిమ్మల్ని నా వదినలా భావించి నా చేతులకు ఉన్న నూనె మీ చీరకు రాశానని చెప్పుకున్నాడు. నీతా పటేరియా ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ఈ అంశం మీద దుమారం రేగుతూనే వుంది.