ఇవి కూడా కాంగ్రెస్ మార్క్ రాజీనామాలేనా

 

మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిల రాజినామాలపై ఇంకా కాంగ్రెస్ మార్క్ డ్రామా కొనసాగుతూనే ఉంది. వారిద్దరూ మళ్ళీ కొత్తగా రాజినామాలు ఇవ్వకుండా, తాము ఇదివరకు ఇచ్చిన వాటికే కట్టుబడి ఉన్నామని చెప్పడంతో, వారిచ్చిన పాత రాజినామా లేఖలు దుమ్ము దులిపి గవర్నర్ కు పంపించవలసి ఉంది. కానీ, ఇంత వరకు అది కూడా జరుగలేదు. కనీసం ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ గానీ ఈ విషయంలో నిర్దుష్టమయిన ప్రకటన వెలువడక పోవడంతో వారి రాజీనామాలపై సస్పెన్స్ డ్రామా ఇంకా కొనసాగుతోంది. కేవలం మీడియాలో ఊహాగానాలు తప్ప నిర్దిష్టమయిన సమాచారం లేదు. ఈ రోజు గవర్నర్ ను కలిసి వస్తున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మీడియా ఇదే విషయం గురించి అడిగితే, వారు రాజీనామాలు చేసినట్లే తనకు తెలియదని చెప్పడం బాధ్యతా రాహిత్యమే కాక పార్టీలో, ప్రభుత్వంలో వారి రాజినామాలపై ఎంత గందరగోళం నెలకొని ఉందో వివరిస్తోంది. పార్టీకి, ప్రభుత్వానికి తమవల్ల ఇబ్బందులు కలగకూడదనే తాము రాజినామాలు చేస్తున్నట్లు ప్రకటించిన సదరు మంత్రులిద్దరూ కూడా వాటిని వెంటనే ఆమోదించాలని ముఖ్యమంత్రిని కోరలేదు. ధర్మాన కోరిక మేరకు ముఖ్యమంత్రి ఆఖరి ప్రయత్నంగా మరోసారి కేంద్రానికి వారి రాజినామాల విషయమై విజ్ఞప్తి చేసి, అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వారి రాజీనామాలు ఆమోదించమని అధిష్టానం చెపితే తప్ప వాటిని గవర్నర్ ఆమోదానికి పంపకపోవచ్చును. బహుశః రేపటికి ఈ విషయంలో స్పష్టత రావచ్చును. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలంటే ఇలాగే ఉంటాయి మరి.