ఆత్మహత్య చేసుకొంటానంటూ కడపలో వివేకా హడావుడి

 

ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, వ్యవసాయశాఖ మంత్రిగా పదవిని కూడా పొందిన వైయస్. వివేకానందరెడ్డి తన వ్యవసాయ శాఖకి, అది ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమి మేలు చేసారో తెలియదు కానీ, ప్రస్తుతం మాత్రం కడప డిసిసిబి కార్యాలయం వద్ద నిలబడి, వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని బెదిరిస్తున్నారు.

 

పోలింగ్ అధికారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేయడంతో, ఈ రోజు ఉదయం జరుగవలసిన డిసిసిబి ఎన్నికను ప్రభుత్వం వాయిదావేసింది. కడప సహకార ఎన్నికలలో పూర్తిగా పైచేయి సాదించిన జగన్ మోహన్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నేతలే పోలింగు అధికారిని ఎత్తుకుపోయి ఎన్నికలు జరగకుండా అడ్డుకొంటున్నారని ఆరోపిస్తున్నారు.

 

దానికి తోడూ కమలాపురం కాంగ్రెస్ యం.యల్.ఏ. వీర శివారెడ్డి కుమారుడు కూడా పోటీలో ఉండటంతో, ఆయన ఉదయం డిసిసిబి కార్యాలయానికి వచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన పైకి చెప్పులు విసరడం, ఆయన వారిపై, తోటి కాంగ్రెస్ మంత్రులపై నది రోడ్డు మీద చిందులు వేయడం వంటి సంఘటనలతో, ఉదయం నుండి అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

ఇప్పుడు, మంత్రి వైయస్. వివేకానంద రెడ్డి కూడా వారికి తోడయి వెంటనే ఎన్నికలు నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకొంటానని కిరణ్ కుమార్ రెడ్డికి హెచ్చరిక జారీ చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. డిసిసిబి ఎన్నికలలో తనకనుకూలంగా తీర్పు రానందున ఎన్నికల అధికారి లేరనే సాకుతో ఎన్నికలను వాయిదా వేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసయిన సరే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు తను ఆత్మహత్యకు కూడా సిద్దమేనని మంత్రి వివేకానంద రెడ్డి ప్రకటించారు.

 

అయితే, ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదు. బహుశః ఆయన ఒత్తిడికి తలొగ్గి అర్ధరాత్రయినా సరే, ఈ రోజే డిసిసిబి అధ్యక్ష పదవికి ఎన్నిక జరిపించే అవకాశం ఉంది.

 

ఈ సంఘటనతో, ఇంతవరకు ఆయనకూ, జగన్ మోహన్ రెడ్డికి అసలుపడదంటూ, వివేకానంద రెడ్డి అనుచరులు చేస్తున్న ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించి, ఇక నేదో రేపో జగన్ మోహన్ రెడ్డి వైపు ఫిరాయించేందుకు సిద్దం అయ్యారని భావించవలసి ఉంటుంది.