మాయావతికి షాక్..రాజీనామాను ఆమోదించిన ఉపరాష్ట్రపతి

మనదేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏదో ఒక విషయంపై రాజీనామాలు చేస్తూ ఉంటారు. అయితే వారి రాజీనామాలు ఆమోదింపబడటానికి రోజుల కొద్ది వేచి చూడాలి. అలాంటిది కేవలం రెండంటే రెండే రోజుల్లో రాజీనామాను ఆమోదిస్తే..నిజంగా విశేషంగానే చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న దాడులపై మాట్లాడేందుకు తనను అనుమతించడం లేదని..ఇలాగైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ రాజ్యసభ నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. అన్న మాట ప్రకారం తన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్‌కు పంపారు..సరైన ఫార్మాట్‌లో మాయావతి రిజైన్ లెటర్ లేకపోవడంతో అది ఆమోదం పొందడం కష్టమేనన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె రాజీనామాకు ఆమోదం తెలిపారు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ. దీంతో బీఎస్సీ శ్రేణులతో పాటు విపక్షాలు షాక్‌కు గురయ్యాయి. మరో ఆరు నెలల్లో మాయావతి పదవీకాలం ముగియనుంది.