జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న మంచు మనోజ్!

 

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో జనసేన పార్టీని సిద్ధం చేసేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. దానికి తగ్గట్టే ఇటీవల జనసేన పార్టీలోకి చేరికలు ఎక్కువయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ బలమైన నేతలను కాకుండా మేధావులకు తన పార్టీలో చోటు కల్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ఉన్నత విద్యలు చదువుకున్న వారు జనసేన పార్టీలో చేరారు. ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణురాజు, అబ్దుల్ కలాం సైంటిఫిక్ సలహాదారు పోన్ రాజ్, రిటైర్డ్ డీఐజీ రవికుమార్ ఇలా చాలా మందిని పవన్ తన పార్టీలోకి ఆహ్వానించారు. విద్యావంతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థానాల్లో అధికారులు, మాజీ పోలీస్ అధికారులు, మాజీ ఐఏయస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు ఇలా పలువురు ఇటీవల జనసేన పార్టీలో చేరారు. తాజాగా దీనిపై స్పందించిన మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు.

'ప్రజా సేవ చేయడానికి విద్యావంతుల సహాయం తీసుకుంటే దానికొక విలువ, అర్ధం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని వాళ్లపై నమ్మకం ఉంచి, గౌరవంతో జనసేన పార్టీలోకి తీసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది' అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన పవన్ అభిమానులు మనోజ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న మనోజ్.. సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అదీగాక మనోజ్ రాజకీయాల్లోకి వస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. కొందరైతే మనోజ్ జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. మరి భవిష్యత్తులో పవన్, మనోజ్ రాజకీయంగా కలిసి పని చేస్తారేమో చూడాలి.