పాము కోసం ప్రాణాలు అడ్డుపెట్టాడు

మనిషి భూమ్మీద మరో ప్రాణులను లేకుండా చేస్తున్నాడనీ..జీవరాశిని కాపాడాలంటూ మైక్ దొరికితే చాలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లు బోలెడుమంది ఉన్నారు. కానీ చుట్టూ ఉన్న ప్రాణులు కూడా మనలాంటివే అన్న కనీస జ్ఞానం లేకుండా సరదాకో..స్వార్థానికో జంతువులను చంపుతుంటారు కొంతమంది..రోడ్డు మీదో, ఇళ్ల దగ్గరో పాములు కనిపిస్తే వాటిని వెతికి వెతికి చంపేదాకా నిద్రపోరు మరికొంత మంది.

 

కానీ ప్రాణాలకు ప్రమాదకరమని తెలిసినా ఒక యువకుడు ఒక కొండచిలువను కాపాడటానికి లైఫ్ రిస్క్ చేశాడు. ఆస్ట్రేలియాలోని డంపియర్ పోర్ట్ అథారిటీ సమీపంలోని రహదారిపై ఓ కొండచిలువు రోడ్డు దాటుతోంది. ఆ టైంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది..అతివేగంలో ఏ వాహనమైనా దాని మీదుగా వెళితే అది చితికిపోవాల్సిందే..కానీ ఇంతలో ఎక్కడి నుంచో వచ్చాడో తెలియదు గానీ మ్యాథ్యూ బేగర్ అనే ఒక యువకుడు రోడ్డు దాటుతున్న కొండచిలువకు సమాంతరంగా పడుకున్నాడు. దీనిని గమనించిన వాహనదారులు వాటిని నిలిపివేశారు. అది రోడ్డు దాటేంత వరకు దానికి రక్షణగా అక్కడే పడుకున్నాడు. కొంతమంది తమ సెల్‌ఫోన్లలో ఈ ఘటనను చిత్రీకరించడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజెన్లంతా ఆ కుర్రాడి సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.