స్కూల్ బెల్ వినాలని ఆరాటపడింది! నోబెల్ ప్రైజ్ గెలుచుకుంది!
posted on Jul 8, 2017 5:06PM
.jpg)
ఆమె వయస్సు ఇప్పుడు 19. లండన్ లో హైస్కూల్ పూర్తి చేసింది. అదే విషయాన్ని చెబుతూ ఓ ట్వీట్ చేసింది. వెంటనే ఆమె చేసిన వరుస ట్వీట్లు నిమిషాల వ్యవధిలో వేల మంది లైక్ చేశారు. రీట్వీట్ చేశారు. అంతలా ఆమెలోని ప్రత్యేకత ఏంటి అంటారా? ఆమె పేరు చెబితే మీకే అంతా అర్థమైపోతుంది! తను … మలాలా యూసుఫ్ జాహి!
మలాలా అన్న పేరు వినగానే చాలా మందికి పాకిస్తాన్, తాలిబాన్ గుర్తుకువస్తాయి. అక్టోబర్ 9, 2012న ఆమెపై హత్యా యత్నం జరిగింది. మలాలా తలలోకి కాల్చి పారిపోయిన తాలిబాన్ ఉగ్రవాది ఆమె చచ్చిపోయింది అనుకున్నాడు. కాని, అక్కడ్నుంచే మలాలా కొత్త జీవితం ప్రారంభమైంది. అంతకు ముందు నుంచే పాకిస్తాన్ లో బాలికల విద్య కోసం గళం వినిపిస్తోన్న మలాలా హత్యా ప్రయత్నంతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. లండన్ తీసుకువెళ్లి ఆమెని ప్రాణాపాయం నుంచి కాపాడారు. తరువాత అక్కడే చదువు కొనసాగించింది మలాలా.
2012 నుంచీ బ్రిటన్ లోనే వుంటున్న పాకిస్తానీ అయిన మలాలా హైస్కూల్ పూర్తి చేసి త్వరలో కాలేజ్ కి వెళ్లనుంది. ప్రవేశం లభిస్తే ఆక్స్ ఫర్ట్ యూనివర్సిటీలో ఉన్నత విద్య నేర్వాలని ఆశపడుతున్న ఆమె త్వరలో మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో పర్యటించనుంది. అక్కడ వున్న కోట్లాది మంది అమ్మాయిలకి చదువు నేర్పించమని తల్లిదండ్రుల్ని అభ్యర్థించనుంది! 2014లో నోబెల్ ప్రైజ్ కూడా పొందిన మలాలా అత్యంత పిన్న వయస్సులో ఆ బహుమతి సాధించిన రికార్డ్ స్వంతం చేసుకుంది. ఆ కారణంగానే మలాలాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. వారి అండతోనే మలాలా ఫండ్ పేరిట సంస్థ ఏర్పాటు చేసి ఆడపిల్లల విద్య కోసం ఉద్యమిస్తోంది!
తాలిబన్ ల ఒక్క బుల్లెట్ కారణంగా… పాకిస్తాన్ లోని మారుమూల స్వాత్ లోయ నుంచి లండన్ లోని బ్రిమింగ్ హామ్ వరకూ చాలా దూరం వచ్చేసింది మలాలా! అందుకే ఆమె యాత్ర ఆశ్చర్యకరం! పోరాటం ప్రేరణాత్మకం!