‘ఆయన’ కాపాడకుంటే… గాంధీ 1944లోనే చనిపోయేవారా?

 

గాంధీని చంపింది ఎవరు? గాడ్సే! అందరం చెబుతాం! కానీ, గాంధీని కాపాడింది ఎవరు? చెప్పలేం! అసలింతకీ మహాత్ముడ్ని కాపాడటం ఏంటి అంటారా? గాంధీ జీని అంతిమంగా తుపాకీతో కాల్చి చంపటానికి ముందు గాడ్సే మరో రెండు హత్యా ప్రయత్నాలు చేశాడు. కాని, అవ్వి వర్కవుట్ కాలేదు. అందులో ఒకటి 1944 జూలైలో జరిగింది! అదుగో అప్పుడు ఒకాయన సాహసం చేసి గాడ్సే నుంచి గాందీని కాపాడాడు. అతనే… బీకూ దాజీ భిలారే! అంతా భిలారే గురూజీ అనే ఈయన 98ఏళ్ల వయస్సులో బుధవారం ఆనారోగ్యంతో మరణించాడు.

 

గాంధీ జీపైన అంతిమ హత్యా ప్రయత్నానికి ముందు చాలా సార్లే అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగాయి. అందులో ఒకటి ఆయన 1944లో పూణే నగరానికి దగ్గరలో వున్న పంచగని పర్వత ప్రాంతంలో వుండగా జరిగింది. అక్కడికి బాపు మలేరియా కారణంగా రెస్ట్ తీసుకోవటానికి వెళ్లారు. ఓ బంగళాలో విడిది చేసిన ఆయనికి తమ నిరసన తెలియజేయటానికి కొంత మంది యువకులు పూణే నుంచి బస్సులో వచ్చారట. మొత్తం ఇరవై మంది వరకూ వున్న ఆ బృందం రోజంతా నిరసనలు, నినాదాలు చేసింది. వారి నాయకుడైన నాథూరామ్ గాడ్సేను బాపూ జీ కలవలాని భావించారట. కాని, అందుకు గాడ్సే ఒప్పుకోలేదు. చివరకు, సాయంత్రం ప్రార్థన కోసం మహాత్ముడు హాలులోకి వచ్చే వేళ గాడ్సే అమాంతం కత్తితో దాడి చేయబోయాడు. కాని, అప్పుడే అక్కడున్న భిలారే గురుజీ అతడ్ని గట్టిగా పట్టుకుని చేయి వెనక్కి విరిచి కత్తి కిందపడేలా చేశాడు…

 

గాడ్సే చేసిన ఈ విఫల హత్యా యత్నం గురించి భిలారే గురుజీ చాలా సార్లే చెప్పారు. ఆయన కాకుండా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా ఓ పుస్తకంలో భిలారే గాంధీని కాపాడాడని చెప్పాడు. కాని, 1944లో గాంధీ పంచగనిలో వుండగా హత్యా యత్నం ఏదీ జరిగినట్టు బలమైన ఆధారాలు మాత్రం ఇంతవరకూ దొరకలేదు. దాని గురించి పెద్దగా చర్చ అప్పట్లో ఎక్కడా జరిగినట్టు సాక్షాలు లేవు. కాకపోతే, గాంధీని కాపాడిన భిలారే కూడా 98ఏళ్ల వయస్సులో ఇప్పుడు మరణించటంతో… స్వతంత్రోద్యమంలో ఒక శకం ముగిసినట్టైంది!