లోకేష్ ఈ దూకుడేలా?

 

ఇంతవరకూ తెరవెనుకే ఉండి తెలుగుదేశంపార్టీ కోసం ప్రణాళికలు సిద్దం చేస్తూ ఉండిపోయిన ఆ పార్టీ నవతరం నాయకుడు నారాలోకేష్ ఇప్పుడు క్రమంగా తెరముందుకి వస్తూ, గత కొంతకాలంగా పార్టీ కార్యకర్తలతో, నాయకులతో కలిసి మీడియా ముందు తరచూ కనబడుతున్నాడు. అంతే గాకుండా ట్వీటర్ వంటి సామాజిక నెట్ వర్క్ ల ద్వారా తన పార్టీ ప్రత్యర్దుల మీద వ్యంగాస్త్రాలు సందిస్తూ, నెట్-యువతని తమపార్టీ వైపు ఆకర్షించగలుగుతున్నాడు. మొన్న వై.యస్సార్. పార్టీని విమర్శిస్తూ, “ఆ పార్టీ వాళ్ళు ఎంత సేపు జగన్ బెయిలుపై తప్పక బయటకి వస్తాడని చెపుతున్నారు తప్ప నిర్దోషిగా విడుదలయి బయటకి వస్తాడని ఎందుకు చెప్పలేకపోతున్నారు?” అని వ్రాసి తన రాజకీయ పరిణతిని ప్రదర్శించి రాజకీయ విశ్లేషకులను సైతం ఆకట్టుకొన్నాడు. అయితే, ఈ రోజు అతను తెరాస నేత హరీష్ రావును లక్ష్యం చేసుకొని వ్రాసిన మెసేజ్, అతనిలో బలాన్ని, బలహీనతనీ కూడా బయట పెట్టింది అని చెప్పవచ్చును.

 

ఎప్పుడో ఏడాది క్రితం హరీష్ రావు సిద్దిపేటలో మీడియావారికి ఇచ్చిన స్టేట్మెంట్ ను ఉటంకిస్తూ ఇప్పుడు సమయం, సందర్బం చూసుకొని ఆ విషయాన్ని ఆయనకి గుర్తు చేస్తూ మీ ప్యూను ఉద్యోగం దరఖాస్తుకోరకు మా తెలుగుదేశంపార్టీ ఎదురుచూస్తోంది. ఎప్పుడు దరఖాస్తు చేసుకోబోతున్నారు? అని వ్యంగంగా అడిగి, తానూ తన విరోధిపార్టీల నేతలని, వారి కార్యక్రమాలని నిశితంగా గమనిస్తూనే ఉన్నానని, పార్టీ భవిష్యత్ అవసరాలకి ఉపయోగపడే ఇతర పార్టీల ప్రతీ స్టేట్మెంటుని రికార్డు చేసుకొంటూ, వాటినే తన ఆయుధాలుగా అవసరమయినప్పుడు తీసి వాడగలనని తన తాజా మెసేజ్ ద్వారా రాజకీయ వర్గాలకి తెలియజేయగలిగేడు. మున్ముందు మరింత రాజకీయ పరిణతిని చూపించగల సత్తా ఉన్నవాడిగా లోకేష్ తనను తానూ నిరూపించుకోగలిగేడు.

 

 ఈ ఏడాది జనవరి నెలలో సిద్దిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తెరాస నేత హరీష్ రావు, తెలుగుదేశం పార్టీకి సవాలు విసురుతూ చంద్రబాబు గానీ హోం మంత్రికి తానూ తెలంగాణాకి అనుకూలమని తెలియజేస్తూ లేఖ వ్రాసినట్లయితే, తానూ తెలుగుదేశం పార్టీలో ఆఫీసుబోయ్ గా పనిచేసేందుకు కూడా సిద్దం అని, దమ్ముంటే చంద్రబాబు ఆవిధంగా లేఖ వ్రాయగలరా? అని సవాలు విసిరేరు హరీష్ రావు. ఈ రోజు డిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు హరీష్ రావు కోరినట్లే వ్రాసి హోంమంత్రికి లేఖ ఇచ్చేరు గనుక, హరీష్ రావు తన మాట నిలబెట్టుకోవాలని ట్వీటర్ లో మెసేజ్ పెట్టాడు లోకేష్.

 

 అందుకు తెరాస నేత కే.తారకరామారావు కొంచెం ఘాటుగా ప్రతిస్పందించగా, హరీష్ రావు మాత్రం లోకేష్ తన మాటల్లో అర్దాన్ని పట్టుకోన్నాడే తప్ప, దాని సారాoశం మాత్రం గ్రహించలేకపోయడని నిశితంగా విమర్శించారు. చంద్రబాబే గనుక ఇప్పటికయినా ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఏర్పరచాలని స్పష్టంగా ప్రకటించినట్లయితే తానూ ఇప్పటికీ తనమాటకు కట్టుబడి ఉన్నానంటూ జవాబిచ్చి, బంతిని లోకేష్ కోర్టులోకి నెట్టేసి ఏమి చేయమంటావో నువ్వే చెప్పు?’ అని ఎదురు ప్రశ్నించాడు.

 

మీ తండ్రి చంద్రబాబుచేత తెలంగాణా రాష్ట్రం ఏర్పరచాలని అందరి ముందూ స్పష్టమయిన ప్రకటన చేయించినట్లయితే తన మాటని తప్పక నిలబెట్టుకొంటానని మరోమారు తెలియజేసి హరీష్ రావు తన రాజకీయపరిణతిని ప్రదర్శించడం ద్వారా లోకేష్ ట్వీటర్ లో పెట్టిన మెసేజ్ ను ఒక చవకబారు ప్రయత్నంగా మలచగలిగేరు. రాజకీయ విశ్లేషకు సైతం హరీష్ రావునే సమర్దించడం చూసినట్లయితే, లోకేష్ ఇకముందు తమ రాజకీయ ప్రత్యర్దులను ఎదుర్కోదలిస్తే, అతను మరికొంత రాజకీయ పరిణతి కనబరచాలని అర్ధమవుతోంది. రాజకీయంగా తమ పార్టీ ప్రత్యర్దులను తన వ్యాక్యాలతో చక్కగా ఇరికించానని తానూ అనుకొంటునపటికీ, హరీష్ రావు వంటి సీనియర్ నేతలతో వ్యవహరించేటప్పుడు, మరింత అప్రమత్తంగా వ్యహరించాలని లోకేష్ గ్రహించాలి. 

 

రాజకీయాలలో కొత్తగా అడుగుపెడుతున్నపుదు చాలా సంయమనం పాటిస్తూ ఆచితూచి మాటలు ఉపయోగించగలిగినప్పుడే ఒక మంచి నాయకుడిగా ఎదగగలుగుతాడు. సిద్దాంతపరంగా అతను ఎన్ని విమర్శలు చేసినా పరువాలేదు గానీ, వ్యక్తిగతంగా చేస్తే మాత్రం నలుగురిలొ నగుబాటు తప్పదు. అలాగ నవ్వులపాలయిన వారిలో పిసిసి అధ్యక్షుడు బోత్ససత్యనారాయణ మొదలుకొని, రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ ముఖర్జీ వరకు చాలా మందే ఉన్నారు. అందువల్ల, తనలో ఎంత ఆవేశం, ఆలోచన ఉన్నపటికీ దానిని అదుపులో ఉంచుకొంటూ ప్రతిస్పందిస్తేనే హుందాగా ఉంటుంది లోకేష్ కి.