తెదేపా సభ్యత్వం స్వీకరించిన లోకేష్

ఇంతవరకు తెరవెనుక నిలబడి తెలుగుదేశం పార్టీకి, తన తండ్రి చంద్రబాబుకి సహకరిస్తున్న నారా లోకేష్ మహానాడు సమావేశాలలో పార్టీ సభ్యత్వం స్వీకరించి అధికారిక సభ్యుడిగా మారారు. ఆయన తన తండ్రి స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు ఎక్సిక్యుటివ్ డైరెక్టర్ హోదాలో కంపెనీని నిర్వహిస్తున్నారు. అయితే దాని నిర్వహణ బాధ్యతలను త్వరలో విదేశాల నుండి ఉన్నత విద్యలు ముగించుకొని స్వదేశం రానున్న తన భార్య బ్రహ్మాణీకి అప్పగించి, పూర్తి స్థాయిలో రాజకీయ ప్రవేశం చేయాలనే ఆలోచనతో నేడు పార్టీలో సభ్యత్వం స్వీకరించారు. అయన పార్టీలో తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. ఇకపై ఆయన కూడా చురుకుగా రాష్ట్ర రాజకీయాలలో పాల్గొంటూ, పార్టీని రాబోయే ఎన్నికలకి సిద్దం చేయడంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీలో లోకేష్ మరియు వైకాపాలో జగన్మోహన్ రెడ్డి ముగ్గురు యువనాయకులు రాబోయే ఎన్నికలలో డీ కొనబోతున్నారు. అందువల్ల లోకేష్ కూడా ఎన్నికల సమయానికి పార్టీలో మరింత కీలక బాధ్యతలు చెప్పటవచ్చును. అయితే, రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీతో సహా అన్నిపార్టీలకు అగ్ని పరీక్షవంటివే గనుక, ఈ యువనాయకులు ముగ్గురికీ తమ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం కల్పిస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికలలో తేదేపాను గట్టేకించగలిగితేనే లోకేష్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. లేకుంటే ఓడిపోయిన సైన్యానికి ఆయన సైన్యాధ్యక్షుడిగా మిగిలిపోతారు.