ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి

 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు.  లోక్‌సభకు 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న రెండో విడత , ఏప్రిల్ 23న మూడో విడత, ఏప్రిల్ 29న నాలుగో విడత, మే 6న ఐదో విడత, మే 12న ఆరో విడత, మే 19న ఏడో విడత పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ  స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్‌ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

ఏప్రిల్ 11న జరిగే తొలి విడతలో మొత్తం 91 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్(25), అరుణాచల్(2), అసోం(5), బీహార్(4), చత్తీస్ గఢ్(1), జమ్ముకశ్మీర్(2), మహారాష్ట్ర(7), మణిపూర్(1), మేఘాలయ(2), మిజోరం(1), నాగాలాండ్(1), ఒడిషా(4), సిక్కిం(1), తెలంగాణ(17), త్రిపుర(1), యూపీ(8), ఉత్తరాఖండ్(5), వెస్ట్ బెంగాల్(2), అండమాన్(1), లక్షద్వీప్(1)లలో పోలింగ్ జరగనుంది.