‘లెజెండ్’ తీర్థయాత్ర దేనికి?
posted on Apr 3, 2014 10:53AM

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు విజయానందంలో వున్నారు. ఆయన చాలాకాలంగా ఎదురుచూస్తున్న విజయం ‘లెజెండ్’ ద్వారా దక్కడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా వుంది. ‘లెజెండ్’ బాలకృష్ణకు సరైన సమయంలో దక్కిన సరైన విజయంగా రాజకీయ, సినీ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సినిమా బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని, తెలుగుదేశం కార్యకర్తల్లో ఈ విజయం ఉత్సాహాన్ని పెంచిందని అంటున్నారు.
గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ‘లెజెండ్’ విజయ యాత్ర చేస్తూ బాలకృష్ణ బిజీగా వున్నారు. ఆయన విజయ యాత్రను చేయడంతోపాటు పనిలోపనిగా తీర్థయాత్రను కూడా చేస్తున్నారు. విజయ యాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సమీపంలోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శిస్తున్నారు. యాదగిరిగుట్ట, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, మంగళగిరి పానకాల స్వామి, తిరుమల వేంకటేశ్వరాలయం తదితర పుణ్యక్షేత్రాలకు బాలకృష్ణ వెళ్ళారు. ఈ విజయయాత్ర కమ్ తీర్థయాత్రలో భాగంలో బాలకృష్ణ మరిన్ని పుణ్యక్షేత్రాలను సందర్భించే అవకాశం వుందని తెలుస్తోంది.
బాలకృష్ణ తీర్థయాత్ర చేస్తోంది కేవలం ‘లెజెండ్’ విజయం సాధించినందుకు మాత్రమే కాదని, ఈ ఎన్నికల నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతూ ముందుగా దేవతామూర్తుల ఆశీస్సులు తీసుకోవడానికే బాలకృష్ణ తీర్థయాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఒకే టూర్‌లో రెండు పనులూ పూర్తి చేస్తున్నారని అభిమానులు, పరిశీకులు చెబుతున్నారు.