ఆత్మే అంతా చేసిందా?

హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించేందుకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమాయత్తమయ్యారా..  ఆ క్రమంలోనే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా  సోమవారం (జూన్ 19)  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారా?  వైయస్ఆర్ టీపీని హస్తం పార్టీలో కలిపేందుకు తెరచాటు మంత్రాగాన్ని వైయస్ షర్మిల తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు నెరిపారా? అనే   చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది.
అంతేకాదు  షర్మిల రాజకీయం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌‌లో చేసుకోవాలి కానీ తెలంగాణలో కాదంటూ మీడియా ఎదుట క్లియర్ కట్‌గా క్లాస్ పీకిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం వైయస్ షర్మిల రాకను ఆమోదించారా?  అనే సందేహం   తెలంగాణ సమాజంలో వ్యక్తమవుతోంది.

అయితే వైఎస్ షర్మిల.. తాను స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా పీకేసి.. తన తండ్రికి రాజకీయంగా ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు అవకాశాలు కల్పించిన  కాంగ్రెస్ పార్టీతో కలిసి అడుగులో అడుగు వేయడం కోసం వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు కర్త కర్మ క్రియ అన్నీ తానే అయి వ్యవహరించి.. రాష్ట్రం కానీ రాష్ట్రంలో రాజన్న బిడ్డను సేఫ్ సైడ్ చేశారని ఓ చర్చ   తెలంగాణ రాష్ట్రంలో హల్‌చల్ చేస్తోంది. 

వైఎస్ షర్మిల కోసం వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు .. తెలంగాణలో పీపుల్స్ మార్చి చేస్తున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కను వెళ్లి కలవడంతోపాటు కర్ణాటక పీసీసీ చీఫ్ కమ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సైతం  మంతనాలు జరపడం, దాంతో  డీకే శివకుమార్‌ నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో వైఎస్ షర్మిల అంశంపై సుదీర్ఘంగా మాట్లాడి..  ఆయన ఓకే అనేలా కన్విన్స్ చేశారన్న   టాక్  గట్టిగా వినిపిస్తోంది.  

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడంతో ఆ పార్టీలో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో ఆ పక్కనే ఉన్న తెలంగాణలో సైతం పాగా వేయాలని హస్తం పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందులోభాగంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దిప్పేందుకు.. కమలనాథులకు కర్ణాటకలోనే కాదు.. తెలంగణలో సైతం ఝలక్ ఇచ్చేందుకు హస్తం పార్టీ అధిష్టానం పక్కా వ్యూహంతో  ప్రణాళికి బద్దంగా అడుగులు వేస్తూ.. ముందుకు సాగుతోంది. 

ఆ క్రమంలో తెలంగాణలోని పలు రాజకీయ పార్టీల్లో ఉన్న అసంతృప్త జీవులపై కన్నేసి.. వారికి స్నేహ హస్తం అందించి పార్టీలోకి తీసుకు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుతో మంతనాలు నెరిపి వారిని కాంగ్రెస్ గూటికి చేరేలా ఒప్పించిందని చెబుతున్నారు.  అలాగే అధికార బీఆర్ఎస్ పార్టీలోని పలువురిని హస్తం పార్టీలోకి తీసుకు రావడం.. వివిధ రాజకీయ పార్టీల్లోని కీలక నేతలకే కాదు.. కేడర్‌ను సైతం పార్టీలోకి తీసుకు వచ్చేందుకు హస్తం పార్టీ  చాపకింద నీరులా వ్యవహారాన్ని చక్కబెట్టుకొంటూ వస్తోందంటున్నారు.  

మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిందీ కేసీఆరే అయినా.. అన్నింటికి సిద్దపడి తెగించి  ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీనే అని తెలంగాణ సమాజానికి  తాజాగా గుర్తు చేయడం కోసం..  అలాగే మోదీ, అమిత్ షా ద్వయం పాలనలో గత తొమ్మిదేళ్లుగా దేశంలో జరిగిన ప్రజాస్వామిక విధ్వంసాన్ని ప్రజలకు సోదాహరణగా వివరించడం కోసం... బంగారు తెలంగాణ అని ప్రచారం చేసుకొంటూ.. కేసీఆర్ ఫ్యామిలీ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల మధ్యే ఎండకట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు.. సమాయత్తమవుతోన్నారు. అలాగే ఇంకోవైపు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిలతోపాటు.. పార్టీలోని సీనియర్లు, జూనియర్లు అంత కలిసికట్టుగా చేతిలో చెయ్యి వేసి నడిస్తే.. రాష్ట్రంలో గెలిచి  గద్దెనెక్కేది హస్తం పార్టీనే అనే అభిప్రాయం పరిశీలకులతో పాటు, సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News