తెగించిన కుమారస్వామి....ఊరటనిచ్చిన సుప్రీం కోర్టు

 

కర్ణాటక రాజకీయం మరో వారం రోజుల పాటు ఉత్కంట రేపనుంది. ఎందుకంటే తాజాగా ఎమ్మెల్యేల రాజీనామాపై వారం రోజుల పాటు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారి రాజీనామాలు ఆమోదించడం కానీ, వారిపై అనర్హత వేటు వేయడం కానీ చేయకూడదని స్పీకర్ ను ఆదేశించింది. తమ రాజీనామాలు ఆమోదించడం లేదంటూ కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల వేసిన పిటిషన్‌ మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 

రాజ్యాంగ వ్యవహారం కావడంతో ఆయా అంశాల మీద స్పష్టత వచ్చేవరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు యథాతథస్థితిని కొనసాగించాలని స్పీకర్ ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేసింది. నిన్నటి సుప్రీం ఆదేశాల మేరకు రాజీనామా చేసిన వారిలో 11 మంది సభ్యులు స్పీకర్‌ను కలిశారు. 

అయితే  తనను కలిసిన 11 మంది రాజీనామాల్లో ఎనిమిది లేఖలు సక్రమ ఫార్మాట్‌లో లేవని, మిగిలిన లేఖలను కూడా  తాను పూర్తిగా అధ్యయనం చేసి ఎమ్మెల్యేలను కలిసి వారు కావాలనే రాజీనామా చేశారా? లేదా బలవంతంగా చేశారా అనేది తెలుసుకోవాల్సి ఉందన్నారు. వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా, మనస్ఫూర్తిగా రాజీనామా చేసినట్టు  కన్విన్స్ అయితే, అప్పుడు వారి రాజీనామాలను ఆమోదిస్తానని చెప్పారు. 

తాను రాజ్యాంగం ప్రకారం, ప్రజల అభీష్టం ప్రకారం నడుచుకుంటానని స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. అయితే స్పీకర్ కావాలని ఈ విషయాన్ని తాత్సారం చేయాలని చూస్తుంటే తాజాగా మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని టైమ్ ఫిక్స్ చేయాలని స్పీకర్ ను కోరానని చెప్పుకొచ్చారు. దేనికైనా తాను సిద్ధంగా ఉన్నానని అందుకే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలనే నిర్ణయానికి తాను వచ్చానని తెలిపారు. ఇక సుప్రీం ఆదేశాలతో మరో వారం రోజులు హైడ్రామా సిద్దమయినట్టే.