ఆయనకే అర్ధమయింది.. జానారెడ్డికి అర్ధంకాలేదు.. కేటీఆర్
posted on Oct 17, 2015 4:33PM

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఈరోజు నల్లగొండ జిల్లా పానగల్లు ఉదయసముద్రం దగ్గర వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులకు మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, లకా్ష్మరెడ్డిలు శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఉత్తర ప్రదేశ్ మంత్రి అఖిలేష్ యాదవ్ కు అర్ధమైంది కాని ప్రతిపక్ష నేత జానారెడ్డికి మాత్రం అర్ధం కావడంలేదని అన్నారు. ఇంటింటికీ నీరు అందిస్తామని మేమంటుంటే.. ప్రతిపక్షాలు కాళ్లకు కట్టెలు పెట్టి అడ్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ప్రజలు నమ్మరని.. వారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోయిందని.. వారి సన్నాయి నొక్కులను ప్రజలు పట్టించుకోరని అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో రైతు సమస్యలపై ఓ రభస చేస్తున్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 42 ఏళ్లు, టీడీపీ 17 ఏళ్లు పాలించాయి..ఇన్నేళ్లు పాలనలో ఉండి రైతులకు ఏం చేశారు.. వారి వల్ల రైతులకు ఇన్ని సమస్యలు వచ్చాయి అని ఎద్దేవ చేశారు. రైతు సమస్యలపై చర్యలు తీసుకుంటున్నామని.. వారి సమస్యలు తీర్చే బాధ్యత మాపై ఉందని.. అందుకే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.