తుమ్మల, నామా ఎడమొహం, పెడమొహం
posted on Apr 2, 2012 7:52AM
ఖమ్మంజిల్లాలో తెలుగుదేశంపార్టీ ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు కీలకమైన నాయకులు. అసలే ఈ జిల్లాలో తెలుగుదేశంపార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ ఇద్దరి ప్రధాన నాయకుల మధ్య సమన్వయ, ఏమాత్రం లేకపోవడంతో పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. తెలంగాణా సెంటిమెంట్ నేపథ్యంలో ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఎంపి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణా సెంటిమెంట్ తో సతమతమవుతున్నారు. ఇద్దరికీ జిల్లా అంతటా క్యాడర్ వున్నప్పటికీ ఈ క్యాడర్ కూడా నాయకుల లాగానే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఎవరికీ వారు వేరు వేరుగా చేస్తున్నారే తప్ప కలిసి పనిచేయడం లేదు. తెలుగుదేశం పార్టీ 30 ఏళ్ళ ఆవిర్భావ దినోత్సవాలను కూడా ఈ రెండువర్గాల వారు ఎవరికీ వారే చేసుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం నాకు కూడా ఈ ఇద్దరు నాయకులు ఖమ్మం జిల్లాలో లేకపోవడం మరో విశేషం.