తెరాసలో కేశవ్ రావుకి పట్టాభిషేకం ఎందుకో

 

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ హస్తం పట్టుకు తిరిగిన కేశవ్ రావ్ తదితరులు, తెలంగాణా సాధన కోసమంటూ కేసీఆర్ కారెక్కినప్పుడు, వారికి కేసీఆర్ చేతిలో అవమానాలు తప్పవని అందరూ ముక్త కంఠంతో ఘోషించారు. ఇంకా అనేకమంది తెరాసలో చేరాలని ఆలోచిస్తున్నపటికీ, ఈ భయంతోనే తెరసలోకి దూకకుండా గోడ మీద ఉండిపోయారు. వారి భయాలను దూరం చేయడానికన్నట్లు, కేసీఆర్ తన పంచన చేరిన కేశవ్ రావుకి పార్టీ జనరల్ సెక్రెటరీగా నియామకం చేయడమే కాకుండా తానూ ఆయన అభిమానంటూ ఆయనని ఆకశానికి ఎత్తేసారు.

 

ఈ దెబ్బతో కేశవరావు పూర్తిగా ఫ్లాట్ అయిపోయే ఉంటారని వేరే చెప్పక్కరలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీలో కేశవ్ రావు నిర్వహించిన కీలక పదవులతో పోలిస్తే ఇదేమంత గొప్ప పదవి కాదని ఆయనకి కూడా తెలిసినప్పటికీ, ప్రస్తుతం ఆ పార్టీలో ఇంత కంటే గొప్ప పదవి మరొకటి లేదు కనుక దానితోనే సరిపెట్టుకోక తప్పదు మరి. ఇప్పుడు ఆయనే స్వయంగా కాంగ్రెస్ పార్టీలో తన మిత్రులను తెరాసలో జేర్పించే శ్రమ తీసుకోవచ్చును.

 

ఇక, కేశవ్ రావుని పార్టీలో అందలం ఎక్కించడం ద్వారా, తెరాసలో చేరాలా వద్దా అని ఊగిసలాడుతున్నఇతర పార్టీల నేతల భయాలు కూడా దూరం అవుతాయి గనుక త్వరలో మళ్ళీ తెరసలోకి వలసలు ఆరంభమవవచ్చును. కేశవ్ రావుకి కాంగ్రెస్ అధిష్టానంతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల, మున్ముందు అవసరమయితే మళ్ళీ ఆపార్టీతో కేసీఆర్ బేరసారాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఒక దెబ్బకు ఇన్ని పిట్టలు కొట్టడం కేవలం కేసీఆర్ కే చెల్లు.