రణరంగం కాదు.. అసెంబ్లీ...
posted on Mar 13, 2015 12:02PM

మనం అది రణరంగమేమోనని అపోహపడతాం కానీ, నిజానికి అది అసెంబ్లీ... బోలెడంతమంది విద్యాధికులు, తెలివైన వారు ఉన్నారని చెప్పుకునే కేరళ రాష్ట్ర అసెంబ్లీ. అసలేం జరిగిందంటే, కేరళ అసెంబ్లీలో శుక్రవారం నాడు ప్రతిపక్షాల ఆందోళనతో గందరగోళం నెలకొంది. అసెంబ్లీలోని అన్ని ద్వారాలనూ ప్రతిపక్ష సభ్యులు మూసివేశారు. మైక్‌లు, స్పీకర్ కుర్చీని ప్రతిపక్ష సభ్యులు విసిరేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎం.మణి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బార్ లైసెన్స్‌ల వ్యవహారంలో కేఎం మణి అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన బడ్జెట్‌ని ప్రవేశపెట్టడానికి అనర్హుడని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో కేఎం మణి రాత్రంతా అసెంబ్లీలోనే వున్నారు. ఈ నేపథ్యంలో కేరళ అసెంబ్లీ ఎదుట యుద్ధ వాతావరణం నెలకొంది. అధికార, ప్రతిపక్షాల మద్దతుదారులు అసెంబ్లీ వద్దకు భారీగా చేరుకున్నారు. వీరందరినీ చెదరగొట్టడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.