కేసీఆర్ కి దడపుడుతోందా..?

 

KCR telangana, kcr trs, kcr congress, chandrababu kcr, ys jagan kcr, separate telangana kcr

 

తెలంగాణ రాష్ట్రం రావడం అసలు కేసీఆర్ కే ఇష్టంలేదని వాదించేవాళ్ల సంఖ్య రోజురోజుకీ రాష్ట్రంలో పెరిగిపోతోంది. కావాలనే తెలంగాణ అంశాన్ని కేసీఆర్ బంగారు గుడ్లుపెట్టే బాతులా చూస్తున్నారని, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్.

 

చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వని కారణంగా టిఆర్ ఎస్ అనే సొంత కుంపటిపెట్టుకుని రాష్ట్రంలో వేర్పాటువాదమనే నిప్పుని రాజేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్న భావన తెలంగాణవాదుల్లో కూడా విపరీతంగా పెరిగిపోతోందని కొందరు పొలిటీషియన్లు ఆరోపిస్తున్నారు.

 

వై.ఎస్ బతికున్న రోజుల్లో కేసీఆర్ కి తెలంగాణ విషయంలో మాట్లాడ్డానికేం పెద్దగా మిగల్లేదు. అడపాదడపా ఏవో దీక్షలు చేసినా అవి చప్పగా చల్లారిపోయాయేతప్ప నిప్పులు కక్కిన దాఖలాల్లేవన్నది కొందరు కాంగ్రెస్ తెలంగాణ నేతల మాట. కాకపోతే.. కేసీఆర్ వల్లే ఎప్పుడో మూలనపడ్డ ఉద్యమం మళ్లీ తారా స్థాయికి చేరిందని నమ్మేవాళ్లూ చాలామందే ఉన్నారు.

 

ఉద్యమం పూర్తిగా పొలిటికల్ జెఎసి అధ్యక్షుడు కోదండరామ్ చేతుల్లోకి పోతోందని భయపడిన కేసీఆర్ హుటాహుటిన లాబీయింగ్ కోసం ఢిల్లీకి పరిగెత్తారు. ఢిల్లీ పెద్దల బందుల దొడ్లో కట్టేసినా, ఛీ.. అన్నా.. ఛా.. అన్నా ఓరిమితో అన్నీ భరించారు. టిఆర్ఎస్ ని కాంగ్రెస్ లో కలిపేస్తానని బేరం పెట్టినా సోనియా మాత అనుగ్రహం దక్కనేలేదు

 

ఢిల్లీలో పడిగాపులు పడీ.. పడీ.. విసుగెత్తిన కేసీఆర్ చివరికి రాష్ట్రానికి ఉత్తచేతులు ఊపుకుంటూ వచ్చారు. అందర్నీ కలుపుకుపోతేనే తనని జనం చీదరించుకోవడం తగ్గుతుంది తప్ప మరో మార్గం లేదని గ్రహించి కోదండకి స్నేహహస్తం చాచారు. ఆయన కాస్తంత మెత్తబడడంతో పాతస్నేహం కొత్త పుంతలు తొక్కింది.

నల్గొండజిల్లాలో ఏర్పాటు చేసిన భారీ గర్జనలో కేసీఆర్ పులిలా ఎంతగా గర్జించాలని ప్రయత్నించినా డొల్లతనం పైకి బాగా కనిపించింది. చేసేదేం లేక తనుకూడా కాంగ్రెస్, టిడిపిల బాటలోనే నడుస్తూ వరాల్ని గుప్పించారు. తెలంగాణ రాజ్యం గురించి ఆయన కంటున్న కలలు పెద్దగా జనాన్ని కదిలించలేకపోయాయనే చాలామంది అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లు చివరాఖరికి జనానిక్కూడా బాగానే తెలుస్తున్నాయని చాలామంది గట్టిగానే అనుకుంటున్నారుకూడా..