కేసీఆర్ ల్యాంకోలో పెట్టుబడులా?

 

రాజకీయ నాయకుడంటే కాంట్రాక్టులు చేసుండాలి. ఒకట్రొండు కుంభకోణాలలోనయినా పేరుండాలి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు తన స్థాయికి తగ్గట్లు లక్షల కోట్లో లేక వేల కోట్లో కనీసం వందల కోట్లయినా వెనకేసుకొని ఉండాలి. తన బందుగణమంతటికీ యధాశక్తిన పార్టీలో, ప్రభుత్వంలో పదవులు కట్టబెట్టగలగాలి. స్వచ్చమయిన తెల్లటి ఖద్దరు బట్టలే కట్టాలి. దాదాపు మన రాజకీయ నాయకులందరికీ ఈ ప్రాధమిక అర్హతలున్నాయని వారు ఏదో ఒక సందర్భంలో నిరూపించుకొంటూనే ఉన్నారు.

 

ఇక రఘునందన్ రావు వెర్సస్ కేసీఆర్ & కో మద్య ఏర్పడిన అవగాహన లోపం కారణంగా తెరాసా నేతల వసూల్ భాగోతాలు కొన్నిటిని మననం చేసుకొన్నపటికీ అవి ప్రస్తుతం తాత్కాలికంగా సీబీఐ గడప దగ్గర ఆగిపోయాయి. ఆంధ్రా పాలకుల కుట్రల వల్ల ఇటువంటి అభాండాలు మోస్తున్న కేసీఆర్ మీద ఇప్పుడు ఆయన గతంలో ‘తెలంగాణ జాతి రత్నం’ గా సర్టిఫై చేసిన మాధుయాష్కీ కూడా కొత్తగా కొన్ని అభాండాలు వేసారు.

 

కేసీఆర్ తనకు ఇచ్చిన సర్టిఫికేట్ ను మళ్ళీ ఇటీవలే రద్దు చేసి ఇప్పుడు ‘తెలంగాణ బుడ్డర్ ఖాన్’ గా మార్చడంతో ఆగ్రహించిన ఆయన తన దగ్గరున్నకేసీఆర్ ఫైల్ తెరిచి అందులో ఉన్న’పిట్టల దొర’ వివరాలను ఆయన మీడియాకు అందజేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణా ను మనస్పూర్తిగా వ్యతిరేఖించే ఆయన బద్ద శత్రువు లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకో కంపెనీలో కేసీఆర్ భారీ పెట్టుబడులు పెట్టారు. ఇక, ఇండియాలో పెట్టుబడులకు రాజకీయ ఇబ్బందులేర్పడితే తట్టుకోవడానికి వీలుగా అమెరికాలో న్యూజెర్సీలో ‘స్ట్రిప్ మాల్’ను కూడా ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా కొనుగోలు చేసి ఉంచుకొన్నారుట. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, బ్రతుకమ్మ పండుగ కలక్షన్లు వంటివి వీటికి అధనం అని ఆయన తెలియజేసారు.

 

తన వంటి తెలంగాణా జాతి రత్నాన్ని డీ-నోటిఫై చేసిన కేసీఆర్ ని, ఆయన కూడా డీ-నోటిఫై చేస్తూ ఇప్పుడు నోట్లు, సీట్లు, ఓట్లు అంటు ఎన్నికల పాట పాడుతున్న ‘పిట్టలదొర' అని ఈ సందర్భంగా కొత్త సర్టిఫికేట్ జారీ చేసారు.