షర్మిల, చంద్రబాబులతో కేసీఆర్ పోటీ

 

ఒకవైపు చంద్రబాబు, షర్మిల నిర్విరామంగా పాదయాత్రలు చేస్తూ స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా వాగ్దానాలు చేసుకుపోతున్నారు. వారిద్దరిలో అధికారంలోకి వచ్చేదెవరో, వచ్చినప్పుడు చేసిన వాగ్దానాలను తీర్చేదెప్పుడో ఎవరికీ తెలియదు. గానీ, ఆకాశం నుండి జడివాన కురుస్తున్న తీరుగా ఇద్దరూ ఒకరితో మరొకరు పోటీలుపడుతూ మరీ వాగ్దానాలు చేసేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

 

ఇక, వీరిద్దరూ ‘వాగ్దానాల బాట’లో సాగిపోతుంటే, ‘తెలంగాణా బాట’లో సాగిపోతున్న కేసీఆర్ కూడా ఎక్కడ పదిమందిని ఉద్దేశించి ప్రసంగించినా ముందు ఆంధ్రోల్లను నాలుగు బూతులు లంకించుకొన్న తరువాత, ఎదురుగా ఉన్న జనాలను బట్టి వారికి తగిన వాగ్దానాలు చేసేస్తుంటారు. సభికులు ప్రభుత్వోద్యోగులయితే వారికి ఇంక్రిమెంటులు, ప్రమోషన్లూ, విద్యార్దులయితే ఉచిత విద్య, ముసలి వారయితే, పెన్షన్లు పెంపుదల, యస్సీ, ఎస్టీ, బీసీ లయితే, ఉద్యోగాలలో రిజర్వేషన్ల పెంపుదలవంటివి ఉంటాయి.

 

ఆయన నిన్న హైదరాబాదులో ఆర్టీసీ మహిళా కాంట్రాక్టు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, కేసీఆర్ వారందరి ఉద్యోగాలు పర్మనంట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ పర్మనెంట్ చేయగా ఇంకా ఎవరయినా కాంట్రాక్టు ఉద్యోగులుగా మిగిలిపోతే వారందరికీ ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక, మహిళలకి (తెలంగాణా మహిళలకి) ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్ల అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

 

ఈ ముగ్గురు నేతలు ప్రస్తుతం చేస్తున్న వాగ్దానాలను కనీసం మీడియావారయినా శ్రమ అనుకోకుండా రికార్డు చేసి భద్రపరిస్తే ఎవరు అధికారంలోకి వస్తే వారికి వారు చేసిన వాగ్దానాల లిస్టులు అందించి వాటిలో ఏమయినా అమలు చేయగలరేమోనని జ్ఞాపకం చేసే అవకాశం ఉంటుంది.