12శాతం ముస్లిమ్ జనాభాకు 12శాతం రిజర్వేషన్లు సాధ్యమా?

 

ఎన్నికల సమయంలో ప్రతీసారీ వినిపించే పదం… రిజర్వేషన్స్! రాజ్యాంగంలో ఏ క్షణాన రిజర్వేషన్లు చేర్చారోగాని మన నేతలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ అంశాన్ని వాడేసుకుంటూ వుంటారు. ఇప్పుడు ఆ వంతు తెలంగాణ శాసన సభకు వచ్చింది. ఏప్రెల్ 16న ముస్లిమ్ లు, గిరిజనులకి రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుందని అంటున్నారు!

 

ముస్లిమ్ లకి పన్నెండు శాతం రిజర్వేషన్ అంశం కేసీఆర్ ఎన్నికల సమయంలోనే లేవనెత్తారు. ఓట్ల కోసమో, నిజంగానే ముస్లిమ్ లలో పేదలున్నారన్న కారణంగానో ఆయన రిజర్వేషన్ల పెంపుకు మాటిచ్చారు. అయితే, ఈ అంశం కోర్టుల్లో గతంలో వీగిపోతూ వస్తోంది. మతం ఆదారంగా రిజర్వేషన్ ఇవ్వకూడదని న్యాయస్థానాలు చెబుతున్నాయి. దేశాన్ని ఏలుతోన్న బీజేపి కూడా ముస్లిమ్ లకు మతం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తోంది. అయినా కేసీఆర్ తన వాగ్ధానంపై ముందుకే పోవాలని నిర్ణియించారు. త్వరలోనే శాసన సభ సమావేశమై ముస్లిమ్ లకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచే బిల్లుకు అమోదం తెలుపనుంది. ఇక దీనికి బీజేపి నుంచి తప్పు ఇతర పార్టీల నుంచీ వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కూడా లేదు. ముస్లిమ్ ఓటు బ్యాంక్ ను దెబ్బ తీసే విధంగా ఏ పార్టీ కూడా కేసీఆర్ వేస్తున్న ఈ ఎత్తును ప్రతిఘటించదు. కాంగ్రెస్ టీడీపీ, అన్ని పార్టీలు తలూపవచ్చు!

 

తెలంగాణలో ముస్లిమ్ లు వున్నదే పన్నెండు శాతం. వారికి బీసీ కోటాలో పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తే దాదాపు మొత్తం అందరికీ రిజర్వేషన్లు వర్తిస్తాయనే! గిరిజనులైతే పది శాతానికి మించటం లేదట. వారికి కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ అంటే… జనాభా కంటే రిజర్వేషన్లు ఎక్కువగా వుంటాయని అర్థం! ఇది నిజంగా విచిత్రమైన పరిస్థితే! అయితే, ఇంతా చేసి రాష్ట్ర అసెంబ్లీలో ముస్లిమ్, గిరిజన రిజర్వేషన్ బిల్లు అమోదించేస్తే… తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశం లేదు! పార్లమెంట్ కు పంపాల్సి వుంటుంది. అక్కడ వున్న ఎన్డీఏ సర్కార్ అమోదం లభించాలి. బీజేపి మత రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంది కాబట్టి అది అంత తేలిగ్గా జరగకపోవచ్చు! ఇక ముస్లిమ్ రిజర్వేషన్లకు వున్న అంతిమ గండం కోర్టు! న్యాయస్థానంలో ఎవరు కేసు వేసినా తీర్పు ఎలా వుంటుందో మనం ఊహించవచ్చు!

 

ఏప్రెల్ 16న కేసీఆర్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపు బిల్లు సభలో పెట్టినా… ఫలితం ప్రజల దాకా చేరేందుకు చాలా సమయమే పడుతుంది. అసలు రిజర్వేషన్ల పెంపు సాధ్యమా అనేది కూడా పెద్ద డౌటే! కాని, ఈ మధ్యలోనే రాజకీయంగా టీఆర్ఎస్ కు ఈ రిజర్వేషన్ల అంశం బాగా కలిసి రావచ్చు. ముస్లిమ్ లకు, గిరిజనులకు మేలు చేసేందుకు తాము కట్టుబడి వున్నామని పీలింగ్ కలిగించటానికి ఈ తతంగం బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ రిజర్వేషన్ల పెంపు కుదరకపోయినా బీజేపి, మోదీ సర్కార్ లను కారణంగా చూపిస్తూ వచ్చే ఎన్నికలకు లైన్ క్లియర్ చేసుకోవచ్చు!

 

వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ముస్లిమ్ రిజర్వేషన్ పేరుతో హామీలు ఇస్తూనే వున్నాయి. వాటి అమలు ఎలా వుందో కూడా అందరికీ తెలిసిందే! ఎక్కడా పేద ముస్లిమ్ లు చెప్పుకోదగ్గ స్థాయిలో బాగుపడటం లేదు. వారికి నిజంగా మేలు చేసే చర్యలు చేపడితే మంచిది. అంతే కాని, రాజకీయ దుమారానికి, కోర్టు కేసులకి అవకాశమిచ్చే పొలిటికల్ స్టంట్స్ వల్ల ఉపయోగం వుండదు!