జగన్ బాటలో యడ్యూరప్ప.. కర్నాటలోనూ పాలనా వికేంద్రీకరణ

ఏపీలో మూడు రాజధానుల నిర్ణయంపై నిరసనలు భగ్గుమంటున్న వేళ కర్నాటక ప్రభుత్వం కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించింది. అయితే రాజధానులను మార్చకుండానే ప్రస్తుతం బెంగళూరులో ఉన్న పలు రాష్ట్ర స్ధాయి కార్యాలయాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకున్న సీఎం యడ్యూరప్ప కర్నాటక అసెంబ్లీలో పాలనా వికేంద్రీకరణకు అనుకూలంగా తీర్మానం కూడా ఆమోదింపజేశారు.

ఏపీలో మూడు రాజదానుల వ్యవహారం ఓవైపు కాకరేపుతుండగానే పొరుగున ఉన్న కర్నాటక ప్రభుత్వం ఇదే బాటలో పయనిస్తోంది. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా పాలనా వికేంద్రీకరణలో జగన్ బాటనే అనుసరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ అనుభవాల నేపథ్యంలో ఒకటికి మించి రాజధానులు కాకుండా బెంగళూరును మాత్రమే రాజధానిగా ఉంచి అక్కడి నుంచి కొన్ని రాష్ట్రస్ధాయి కార్యాలయాలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. దీంతో పాలనా వికేంద్రీకరణ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. కర్నాటలో స్ధానికంగా అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న కారణంతో అక్కడి యడ్యూరప్ప ప్రభుత్వం వికేంద్రీకరణకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి అనుమతి తీసుకున్న సీఎం యడ్యూరప్ప వివిధ రాష్ట్ర స్ధాయి కార్యాలయాలను పాలనా వికేంద్రీకరణ పేరుతో తరలించేందుకు కర్ణాటక అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదింపజేశారు.

కర్నాటక ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం త్వరలో బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు రాష్ట్ర స్ధాయి కార్యాలయాలు తరలిపోనున్నాయి. వీటిలో నీటిపారుదలశాఖకు చెందిన కృష్ణభాగ్య జల నిగమ్, కర్నాట నీరవరి నిగమ్, పవర్ లూమ్ కార్పోరేషన్, షుగర్ డైరెక్టరేట్, షుగర్ కేన్ డెవలప్ మెంట్ కమిషనర్ కార్యాలయం, కర్నాటక మానవ హక్కుల కమిషన్ కార్యాలయం, ఉప లోకాయుక్త కార్యాలయం ఉన్నాయి. వీటిని బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు తరలించనున్నట్లు యడ్యూరప్ప ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. వీటిని ఎప్పటి కల్లా తరలించాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అసెంబ్లీ తీర్మానం మేరకు త్వరలోనే వీటి తరలింపు ఉంటుందని మాత్రం మంత్రులు చెబుతున్నారు.

వాస్తవానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అనుసరించడం కర్ణాటకలోని యడ్యూరప్ప ప్రభుత్వానికి ఇదే తొలిసారి కాదు. జగన్ ప్రభుత్వం ఏపీలో అధికారం చేపట్టిన వెంటనే తీసుకున్న పరిశ్రమల్లో 75 శాతం స్ధానిక కోటా నిర్ణయాన్ని కర్ణాటకలోనూ అమలు చేయాలని ఇప్పటికే యడ్యూరప్ప సర్కారు నిర్ణయించింది. దీనికి అనుకూలంగా, వ్యతిరేకంగా రాష్ట్రంలో పలు వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా స్ధానిక కోటాను అనుకూలంగా కొందరు ఆందోళనకారులు ఏపీ టూరిజం బస్సుపై దాడికి కూడా పాల్పడ్డారు. ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా పాలనా వికేంద్రీకరణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. రాజధానుల విస్తరణ పేరు వాడకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.