నందమూరికి సిసలు వారసుడు జూ.ఎన్టీఆరేనా?

 

కొందరు చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే వారయితే, ఆ కాయలిస్తున్నచెట్టు తమపాలిట కల్పతరువని భక్తితో మొక్కేవారు మరి కొందరు. జూ.యన్టీఆర్ విషయానికి వస్తే ఆయన తన తాతగారయిన నందమూరి తారక రామారావుని తలవని రోజు లేదు, సినిమా లేదు. ఆయన నామ స్మరణ చేయని ప్రసంగమూ లేదు. యన్టీఆర్ తన స్వగ్రామమయిన నిమ్మకూరులో అడుగుపెట్టనని శపధం చేయడంతో, జూ.యన్టీఆర్ స్వయంగా ఆ ఊరులో తన తాతానాయనమ్మల విగ్రహాలు ప్రతిష్టించారు.

 

ఆయనకు అనేక మంది మనవలు, మనుమరాళ్ళు ఉన్నపటికీ, ఏకలవ్య శిష్యుడు వంటి జూ.యన్టీఆర్ అంటే ఆయనకు ఒక ప్రత్యేక అభిమానం. నటనలో, బాషలో, యాసలో అన్నివిధాల తనకు ప్రతిరూపంగా కనబడే తన జూనియర్ ని చూసి ఆయన చాలా ముచ్చటపడేవారు. నిజం చెప్పాలంటే నందమూరి కుటుంబంలో ఆ తాతా మనవళ్ళ మద్య ఉన్న మానసిక అనుబంధం మిగిలిన వారిలో అంతబలంగా కనబడదు. అలాగని వారికి ఆయనతో అనుబంధం లేదని కాదు కానీ వారంరికంటే జూ.యన్టీఆర్ ఏర్పరచుకొన్న అనుబంధం ప్రత్యేకమయినది.

 

అందుకే తన ప్రతీ సినిమాలో, ప్రసంగంలో జూ.యన్టీఆర్ తాత నామస్మరణ చేస్తుంటారు. అయితే, కొందరు గిట్టని వారు, లేదా ఆయనతో పోటీ పడలేని వారు, ఆయన కొంచెం అతి చేస్తున్నాడని, చెట్టుపేరు కాయలు అమ్ముకొంటున్నాడని ఆరోపణలు చేయడం వింటుంటాము.

 

అయితే, జూ.యన్టీఆర్ కేవలం తన స్వయం కృషితోనే పైకి వచ్చారు తప్ప, కనీసం ఆయన తన తండ్రి, తాతగారి పేరు, పలుకుబడిని కూడా ఏనాడు వాడుకోలేదు. నిజం చెప్పాలంటే, జూ.యన్టీఆర్ తన స్వయం ప్రతిభతో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన తరువాతనే ఆయనను అందరూ గుర్తించడం ప్రారంబించారు. చివరికి నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఆ తరువాత నుండే ఆయనను తమ కుటుంబములో ఒక సభ్యుడిగా అంగీకరించడం ప్రారంభించారు.

 

ఈ రోజు కూడా ప్రతీ ఏడులాగే ఈ ఏడు కూడా తాత 90వ జయంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం తో ఉన్న ఒక ఫుల్ పేజ్ ప్రకటన ఇచ్చి ఘనంగా నివాళులు అర్పించారు.

 

ఇటువంటి నిష్కకళంక మనసుతో తాతని దైవ సమానుడిగా పూజించే జూ.యన్టీఆర్ కంటే, అవసరార్ధం స్వర్గీయ యన్టీఆర్ భజన చేసేవారు, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసేవారు, పాలాభిషేకాలు చేస్తూ మీడియాకి ఫోజులిచ్చేవారే నేడు స్వర్గీయ యన్టీఆర్ పై పేటెంట్ హక్కులున్నట్లు మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాము. అటువంటి వారే జూ.యన్టీఆర్ ను నేడు నిలదీస్తున్నారు కూడా.

 

అయినప్పటికీ జూ.యన్టీఆర్ మాత్రం నిండు కుండలా తొణకలేదు, ఎవరి మీద మాట తూల లేదు. తనని మహానాడుకి పిలవనందుకు బాధపడినప్పటికీ ఎవరినీ నిందించలేదు. పిలిచి ఉంటే తప్పక వచ్చేవాడినని మాత్రమే అన్నారు. దానికే భుజాలు తడుముకొన్న తెదేపా యన్టీఆర్ వారసులకి మళ్ళీ ప్రత్యేకంగా పిలుపులెందుకు? అని అతితెలివిగా ఎదురు ప్రశ్నించి మహానాడుకి రాకపోవడం అతని తప్పేనని బుకాయించడం విశేషం. ఇంట్లో శుభాకార్యనికయినా కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించడం మన తెలుగు సంప్రదాయం. కానీ అది నందమూరి కుటుంబ సభ్యులకి మాత్రం వర్తించదని తెలుగుదేశం పార్టీ ఉవాచ.