వైఎస్ విజయమ్మతో జేసీ భేటీ.. జగన్ కు షాకేగా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తల్లి వైఎస్ విజయమ్మతో తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకరరెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ విమర్శకులలో జేసీ ప్రభాకరరెడ్డి ముందు వరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే.  జగన్ హయాంలో జేసీ దివాకరరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి పలు విధాలుగా వేధిపులకు గురయ్యారు. జగన్ హయాంలో వారిపై పలు కేసులు నమోదుఅయ్యాయి. వారి ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సులను జగన్ సర్కార్ సీజ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రావెల్స్ సంస్థ వ్యవహరిస్తోందంటూ పలు కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డిలు  జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. 

కాగా ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్  ప్రభుత్వ హయాంలో తనపై తప్పుడు కేసులు బనాయించారంటూ జేసీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఆ సందర్భంగా జగన్ పై వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారు.  ఈ నేపథ్యంలో జేసీ విజయమ్మల భేటీ రాజకీయంగా సంచలనానికి కారణమైంది. జేసీ సోమవారం (జులై 29) హైదరాబాద్  లోటస్ పాండ్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లి మరీ ఆమెతో భేటీ అయ్యారు. వీరి భేటీ అరగంటకు పైగా సాగింది. ఈ భేటీలో వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటి? అన్నది తెలియరాలేదు. జేసీ వర్గీయులు మాత్రం ఇది సాధారణ భేటీయేననీ, జేసీ విజయమ్మ ఆరోగ్యం, క్షేమ సమాచారాలను తెలుసుకున్నారని చెబుతున్నారు. గతంలో అంటే వైఎస్ హయాంలో జేసీ దివాకరరెడ్డి బ్రదర్ కాంగ్రెస్స్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలు కూడా ఉండేవి. ఆ పరిచయాలను పురస్కరించుకునే విజయమ్మను మర్యాదపూర్వకంగా జేసీ కలిశారని చెబుతున్నారు. 

ఈ భేటీ ఉద్దేశం ఏమిటన్నది పక్కన పెడితే.. విజయమ్మతో జేసీ భేటీ జగన్ కు మాత్రం గట్టి షాక్ గానే చెప్పాలి. తనకు బద్ధ శత్రువుగా మారిన చెల్లెలు షర్మిలకు మద్దతుగా విజయమ్మ నిలబడ్డారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత ఆమె ఏ సందర్భంలోనూ కూడా జగన్ కు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. షర్మిలకు అండగానే నిలిచారు. ఇటీవలి ఎన్నికలలో కూడా ఆమె అమెరికా నుంచి పంపిన సందేశంలో షర్మిలను గెలిపించాల్సిందిగా కోరారు తప్ప జగన్  గురించి మంచిగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  జగన్ కు రాజకీయంగా ఇబ్బంది వచ్చిన ప్రతి సందర్భంలోనూ విజయమ్మ ముభావంగానే ఉంటూ వచ్చారు.

ఏవైనా కార్యక్రమాలలో అంటే వైఎస్ జయంతి, వర్థంతి వంటి కార్యక్రమాలకు హాజరై జగన్ ను హత్తుకుని ముద్దు పెట్టి ఫొటో దిగడానికే ఆమె పరిమితమయ్యారు. విజయమ్మ జగన్ కు దూరం కావడం కూడా ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఒక కారణంగా పరిశీలకులు విశ్లేషించారు.  ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి విజయమ్మతో భేటీ కావడం రాజకీయంగా జగన్ కు ఇబ్బందికరమైన అంశమే.   జగన్ కు అధికారం కోల్పోయి, అన్ని వైపుల నుంచీ సమస్యలు చుట్టుముడుతున్న తరుణంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లుగా విజయమ్మతో జేపీ భేటీ కొత్త తలనొప్పికి కారణమౌతుందనడంలో సందేహం లేదు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News