తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు... కేవలం 20 ఎమ్మెల్యేలు అంతే..

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఒకపక్క రాష్ట్రం రోదనలో పడగా.. మరోపక్క మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించవచ్చని అప్పుడే రాజకీయ నిపుణులు అంచనాలు మొదలుపెట్టారు. తమిళనాడులో  ‘పురచ్చి తలైవీ’గా కోట్లాది మంది గుండెల్లో కొలువైన జయలలిత మృతి చెందడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే జయలలిత తరువాత డీఎంకే పార్టీకి పోటీగా పార్టీని నడిపే సత్తా ఇంకెవరికీ లేదు అన్నది అందరికి తెలిసిందే. జయ తరువాత అంతటి స్థానంలో పేరు పొందిన నేత ఒక్కరు కూడా ఆ పార్టీలో లేరు. ఇక ఆమె ప్రధాన అనుచరుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టినా... జయకు ఉన్న ప్రజాకర్షణలో పన్నీర్ సెల్వం ఒక వంతు కూడా సాటిరారు. ఆమె సన్నిహితురాలైన శశికళ కూడా ఇంతవరకూ జయలలితకు నిచ్చెలిగానే ఉన్నారు కానీ.. పార్టీలోకి మాత్రం ప్రవేశించలేదు.

 

ఈ నేపథ్యంలోనే జయ లేకపోవడం డీఎంకే పార్టీకి ప్లస్ పాయింట్ అయినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలను కొట్టిపారేయలేమంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే తమిళనాడు అసెంబ్లీలో శాసనసభ్యలుల సంఖ్య 234. ఇందులో అధికార అన్నాడీఎంకే బలం 134 కాగా... విపక్ష డీఎంకే, కాంగ్రెస్ కూటమి బలం 98. అధికారంలోకి రావాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అంటే, డీఎంకే కూటమి మరో 20 మంది ఎమ్మెల్యేలను లాగేస్తే చాలు.... మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టే. ఇప్పుడు దీనిపైనే అందరి దృష్టి పడింది. ఇంతకాలం జయలలిత కనుసైగలకు అనుగునంగా భయపడో, భక్తితోనే ఉన్న పలువురు అన్నాడీఎంకే నేతలకు... ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టైంది. దీంతో డీఎంకే పార్టీ నేతలు అన్నాడీఎంకే పార్టీ నేతలతో పావులు కదపొచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా వారిని తమ పార్టీవైపుకు లాక్కునే ప్రయత్నాలు చేయవచ్చు అని అంటున్నారు నిపుణులు. మరోవైపు, పన్నీర్ సెల్వం, జయ స్నేహితురాలు శశికళల మధ్య చిన్న విభేదం తలెత్తినా... డీఎంకే పని మరింత సులువవుతుందని అంటున్నారు. మరి జయ లాంటి పవర్ పార్టీలో లేకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొత్తానికి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.