జైరాం.. ఇక రెండు రాష్ట్రాల్లో రాం రాం

 

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన విషయాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి, ఎన్నికల వేళ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి తామున్నామంటూ పాలమూరుకు వచ్చిన కేంద్ర మంత్రి జైరాం రమేష్, రాహుల్ దూత కొప్పుల రాజులకు క్షేత్రస్థాయిలో తమ పార్టీ పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలిసింది. సీమాంధ్రలో ఎటూ ఒక్కసీటైనా రావడం కష్టమేనని తెలిసినా, తెలంగాణాలో బ్రహ్మాండంగా ఉంటుందని అనుకున్నారు. కానీ, ఇక్కడ సైతం వాళ్లు ఊహించని పరాభవం ఎదురుకావడంతో విస్తుపోయారు.

 

మునిసిపాలిటీ ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వలేదని కొందరు నాయకులు గొడవ సృష్టించారు. మహబూబ్‌నగర్ మునిసిపాలిటీ 31 వార్డు నుంచి తమ కుటుంబానికి టికెట్ ఇప్పిస్తామని నాయకులు చెప్పడంతో తన చిన్న కూతురు రేణుకను నామినేషన్ వేయిస్తే బీఫామ్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపారని డీసీసీ కార్యదర్శి నాగమణి స్థానిక డీసీసీ కార్యాలయం వద్ద కన్నీటిపర్యంతమైంది. ఆమె కూతుళ్లు ఉమ, టికెట్ ఆశించిన రేణుక కేంద్రమంత్రి జైరాం రమేశ్ ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో హాలు బయటపార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హంగామా చేశారు. తమకు టికెట్ రాకుండా ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, ముత్యాల ప్రకాశ్ కుట్ర చేశారని, డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.