విభజించు.. పాలించు

 

కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. విభజించి పాలించే విధానాన్ని పదే పదే పాటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం ఉంటే తనకు ఇబ్బంది అని విభజించి, ఇప్పుడు మళ్లీ రెండువైపులా కూడా ప్రజల్లోను, నాయకుల్లోను విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగమే కేంద్ర మంత్రి జైరాం రమేష్ పర్యటన, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు.

 

ఆంధ్రప్రాంతంలో పర్యటించినంత కాలం అక్కడి ప్రజలను, నాయకులను కూడా నోటికి వచ్చినట్లల్లా తిట్టిపోసిన జైరాం రమేష్.. తాజాగా తెలంగాణలోనూ అదే పని చేస్తున్నారు. జేఏసీ నేతలకు వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇస్తామని ప్రకటనలు చేయడం, మరోపక్క తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలతో సమావేశం కానున్నట్టు ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ పార్టీకి- తెలంగాణ జేఏసీకి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీన్ని పార్టీ సీనియర్ నేత, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కూడా తీవ్రంగా విమర్శించారు. హత్యలు చేసినవాళ్లే శవంపై పూలు చల్లి శ్రద్ధాంజలి ఘటించినట్టుగా ఆయన తీరు ఉందని దుయ్యబట్టారు. జేఏసీకి, టీఆర్‌ఎస్‌కు మధ్య అంతరం పెంచే పాపపు పనికి ఒడిగడుతున్నారని ఆరోపించారు.