జగన్ వర్సెస్ పవన్... జనం ఎవరి పక్షం?
posted on Aug 1, 2017 2:56PM

ఏపీలో అప్పుడే పొలిటికల్ వార్ మొదలైంది. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమున్నా... ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. కూల్ కూల్ గా సాగాల్సిన అక్టోబర్‌లో పొలిటికల్ హీట్ పుట్టించేందుకు ఒకవైపు జగన్.... మరోవైపు పవన్ రెడీ అవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇద్దరూ అక్టోబర్ నెలనే ఎంచుకోవడంతో... రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. జగన్ పాదయాత్రలకు ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేస్తే... ఇకపై తన టైమ్ లో మూడో వంతు రాజకీయాలకే కేటాయిస్తానంటూ ఢంకా బజాయించి చెప్పారు పవన్.
జగన్ పాదయాత్రకు ముందు 60 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ప్రశాంత్ కిషోర్ టీమ్. పాదయాత్ర కోసం మూడు దశల్లో కార్యక్రమాలను డిజైన్ చేశారు. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకూ మరోసారి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం చేపడతారు. అలాగే 2019 ఎన్నికల కోసం సిద్ధం చేసిన 9 అంశాల మేనిఫెస్టోను నవరత్నాల పేరుతో ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.సెప్టెంబర్ 22 నుంచి 25 వకూ విజయ శంఖారావం ఏర్పాటు చేశారు. జగన్ ఈ రేంజ్ లో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోగా పవన్ కూడా అక్టోబర్ నుంచే జనం మధ్యకు వెళ్లనున్నారు. జగన్ మాదిరిగా పాదయాత్ర కాకపోయినా.. దాదాపు అలాంటి వ్యూహంతోనే పవన్ కూడా జనం మధ్య ఉండేందుకు స్కెచ్ రెడీ చేసుకుంటున్నారు. అయితే జగన్ పాదయాత్రపై పవన్ పరోక్షంగా సెటైర్లు కూడా వేశారు. పాదయాత్రతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావన్న పవన్.. తాను కారులో వెళ్లడానికే కష్టమవుతోందని... ఇక పాదయాత్ర చేస్తే అడుగు కూడా ముందుకు పడదంటూ తనకున్న క్రేజ్, స్టామినా ఏంటో చెప్పకనే చెప్పారు.
అయితే పవన్ ఇప్పుటికిప్పుడు తన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం వెనక చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. పవన్ కల్యాణ్ ....చంద్రబాబు వదిలిన బాణమేనని అందుకే బాబుతో మీటింగ్ తర్వాతే తన కార్యాచరణను ప్రకటించారని అంటోంది. అయితే టీడీపీకి రహస్య స్నేహితుడినన్న వైసీపీ ఆరోపణలపైనా పవన్ ఘాటుగా స్పందించారు. తానెవరికీ రహస్య స్నేహితుడిని కాదంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి జగన్, పవన్ ప్రకటనలు చూస్తుంటే... ఇఫ్పుడే ఎన్నికలు వచ్చేశాయేమోనన్న అనుమానం కలుగక మానదు. ఇక జగన్, పవన్ ఒకేసారి జనంలోకి వెళ్లనుండటంతో... ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరూ జనాదరణ కలిగిన నేతలే.. ఒకరిది స్టార్ పవర్... మరొకరిది ఛరిష్మా పవర్... ఈ రెండు పవర్లలో ఏ పపర్ మోస్ట్ పవర్ ఫుల్లో...ఎవరి బలం ఎంతో... జనం ఎవరి పక్షమో ...2019లోనే తేలనుంది.