జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ హస్తం అందుకొంటాడా?

 

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్‌ను పొడిగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఐ వచ్చే నెలాఖరులోగా తన దర్యాప్తు ముగించవలసి ఉంటుంది. అందువల్ల సీబీఐ కూడా తన దర్యాప్తును దాదాపు పూర్తిచేసి వచ్చే నెలాఖరులోగా జగన్ పై ఆఖరి చార్జ్ షీట్ కూడా వేసేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం. ఒకవేళ సీబీఐ గనుక తన తుది చార్జ్ షీట్ దాఖలు చేసినట్లయితే, జగన్ కేసుల్లో విచారణ ఆరంభమయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు అతను మళ్ళీ బెయిలు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఇదివరకే అనుమతించింది గనుక, అప్పుడు జగన్ మరో మరు దరఖాస్తు చేసుకోవచ్చును. ఇప్పటికే ఎటువంటి విచారణ ఎదుర్కొనకుండా 14 నెలలు జైల్లో గడిపినందున ఆయనకి బెయిలు మంజూరు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

 

ఒకవేళ ఆయన బెయిలుపై బయటకి రాగలిగితే, ఆయనపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తులు లేదా విలీనానికి ఒత్తిడి చేసే అవకాశం ఉంది. అందుకు ఆయన అంగీకరించకపోతే ఆయనపైకి ఎన్ఫోర్స్ మెంట్ అధికారులను ఉసిగొల్పి తీహార్ జైలుకి తరలిస్తామని బెదిరించినా ఆశ్చర్యంలేదు. మరి ఆయన కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగి ఆ పార్టీతో స్నేహానికి సిద్దపడతాడో లేదో తేలిపోతే, దానిని బట్టి రాష్ట్ర రాజకీయాలలో కూడా కొత్త సమీకరణాలు, వ్యూహాలు కూడా ఏర్పడుతాయి. ఒకవేళ జగన్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్లయితే, వారిని డ్డీ కొనడం తేదేపాకు శక్తికి మించిన పనే అవుతుంది.

 

కానీ, ఇన్నాళ్ళుగా తనను జైలులో నిర్బందించినందుకు కాంగ్రెస్ పై కోపంతో రగిలిపోతున్న జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ బెదిరింపులకి భయపడకుండా కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనదలిస్తే, అది తేదేపాకు కొంత మేలు చేయవచ్చును. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ జైలుకి పంపితే అది అతని పార్టీకి సానుభూతి ఓట్లను కురిపించే అవకాశం ఉంటుంది గనుక, కాంగ్రెస్ కూడా అందుకు దైర్యం చేయకపోవచ్చును. అందువల్ల కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదా విలీనం విషయంలో అతని అభిప్రాయం తెలుసుకొన్న తరువాతనే అతనిని విడుదల చేయడానికి మార్గం సుగమం చేయాలా వద్దానే సంగతి కాంగ్రెస్ తేల్చుకొనవచ్చును. దానిని బట్టే ప్రస్తుతం కొనసాగుతున్నసీబీఐ కేసులలో కూడా కామాలు, ప్రశ్నార్ధకాలు, ఫుల్ స్టాపులు వంటివి ఉండే అవకాశం ఉంటుంది.

 

ఒకవేళ, జగన్ జైలు నుండి విడుదల అయ్యి, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్లయితే, అది తేదేపాకు అగ్నిపరీక్షగా మారడం ఖాయం. బలమయిన ఈ ఇద్దరు ప్రత్యర్ధులు చేతులు కలిపినట్లయితే అది తేదేపాకు శక్తికి మించిన పరీక్షే అని చెప్పవచ్చును. ఒకవేళ అదే జరిగితే తెదేపాకు ఇటు సీమాంధ్ర రాష్ట్రంలో, అటు తెలంగాణా రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనడం శక్తికి మించిన పనే అవ్వవచ్చును. రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబు బహుశః ఇది గ్రహించబట్టే, కాంగ్రెస్ పార్టీ తన పార్టీని దెబ్బతీయడానికే రాష్ట్ర విభజనకు పూనుకోందని ఆరోపిస్తున్నట్లు అర్ధం అవుతోంది.

 

అయితే, అందుకు ఆయనే స్వయంగా సమ్మతిస్తూ లేఖ ఇచ్చారు గనుక అది స్వయంకృతాపరాధం అని చెప్పకతప్పదు. మరి ఆయన ఈ గడ్డు సమస్యను అధిగమించగలరో లేదో రానున్న ఎన్నికల కంటే ముందుగానే తెలిపోవచ్చును.