కాదేదీ ధర్నాలకనర్హం అంటున్న వైకాపా

 

హూద్ హూద్ తుఫాను ధాటికి అతలాకుతలమయిన ఉత్తరాంధ్ర జిల్లాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా పర్యవేక్షించారు. చంద్రబాబాబు చొరవ కారణంగానే చుట్టుపక్కల జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి భారీ ఎత్తున కూరలు, దుంపలు, ఉల్లిపాయలు, బియ్యం వంటి నిత్యావసర సరుకులు మూడు జిల్లాలలో విరివిగా పంచబడుతున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ కారణంగానే నేటికీ స్థానిక బజార్లలలో నిత్యావసర వస్తువుల ధరలు పూర్తి అదుపులో ఉన్నాయి.

 

అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఇరుగుపొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుండి విద్యుత్, మున్సిపల్, అగ్నిమాపక, వైద్య సిబ్బందిని, పడిపోయిన విద్యుత్ స్తంభాలను, చెట్లను తొలగించేందుకు లారీలు, ప్రోక్లేయిన్లు, విద్యుత్, టెలిఫోను స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తదితర యంత్ర సామాగ్రిని చాలా భారీ ఎత్తున ఈ మూడు జిల్లాలకు తరలించడంతో యుద్ద ప్రాతిపాదికన సహాయ, పునరావాస చర్యలు జరుగుతున్నాయి. అందుకే కేవలం పదిరోజుల వ్యవధిలోనే విశాఖ, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలు తేరుకోగలుగుతున్నాయి.

 

అంతే కాదు ప్రభుత్వం తుఫాను భాదితుల సహాయార్ధం ఒక వెబ్ సైట్ కూడా తెరిచి, అందులో పిర్యాదులు నమోదు చేసుకొంటూ ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తోంది. ఇంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని ఇటువంటి పెనుతుఫాను వల్ల జరిగిన నష్టం అంచనా వేయడం, సహాయ, పునరావాస చర్యలు చెప్పట్టడం, ఆపత్సమయంలో బాధితులకు అవసరమయిన సహాయం అందించడంలో ప్రభుత్వం చాలా వరకు సఫలమయిందనే చెప్పవచ్చును.

 

ఇరుగు పొరుగు జిల్లాల నుండి తరలి వచ్చిన సహాయ బృందాలను సమన్వయం చేసుకొంటూ, బాధితులందరికీ సహాయం అందేలా చేయడానికి ప్రభుత్వం శక్తి వంచనలేకుండా కృషి చేసింది, చేస్తోంది. వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన వారినందరినీ సమన్వయము చేసుకొంటూ ఇంత సమర్ధంగా సహాయ చర్యలు చేప్పట్టడం అంత తేలిక కాదని ఎవరికయినా అర్ధమవుతుంది. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం తుఫాను భాదితులకు సహాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అభిప్రాయపడటం విశేషం. నేటికీ అనేక గ్రామాలలో పునరావాస చర్యలు మొదలవనే లేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకి కేవలం ప్రచారార్భాటమే తప్ప సహాయ, పునరావాస చర్యలు చెప్పట్టడంలో ఏ మాత్రం శ్రద్ధ లేదని ఆయన విమర్శించారు. అందుకే వచ్చే నెల 5న తుఫాను పీడిత ప్రాంతాలలో ధర్నాలు, ర్యాలీలు చేప్పట్టాలని పార్టీ నేతలకీ, కార్యకర్తలకీ పిలుపిచ్చారు. అంటే హూద్ హూద్ తుఫాను కూడా ధర్నాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అర్ధమవుతోంది.

 

బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా ఇటువంటి విపత్సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడలేకపోయినా, కనీసం సహాయ, పునరావాస చర్యలలో వైకాపా కూడా పాలుపంచుకోవచ్చును. దానికీ అభ్యంతరం ఉన్నట్లయితే కనీసం హూద్ హూద్ వెబ్ సైటులో ఏ ఏ ప్రాంతాలలో సహాయ, పునరావాస కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదో తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించినా ప్రజలు హర్షించేవారు. కానీ కష్టాలలో ఉన్న ప్రజల గోడు పట్టించుకోకుండా దీనినుండి కూడా రాజకీయ మైలేజీ పొందేందుకు ధర్నాలు చేయాలనుకోవడం చాలా శోచనీయం.