సీబీఐ విచారణకు టీడీపీ ఎందుకు వెనుకాడుతుంది

 

వైసీపీ అధినేత వైఎస్ జగన్.. గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ఏపీలో నెలకొన్న పరిస్థితులు, వివేకానంద రెడ్డి హత్య ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ డీజీపీ, అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తుల్ని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. అలాంటి అధికారులు ఉంటే ఎన్నికలు సజావుగా జరగవన్నారు. రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిని ఢీకొట్టేందుకు తాము జమ్మలమడుగులో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చామని, ఆ సమయంలో నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతూ ప్రచారం చేస్తున్న తన చిన్నాన్నను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యలో టీడీపీ హస్తం లేకపోతే సీబీఐ విచారణకు ఇచ్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. హత్యకు గురైంది సామాన్యమైన వ్యక్తి కాదని, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు. వివేకాకు ఎలాంటి సెక్యూరిటీ లేదన్నారు. ఆయన ఎంతో సౌమ్యులని, ఎక్కడికి వెళ్లినా ఒక్కరే వెళ్లిపోతుంటారన్నారు. రాత్రి ఇంట్లో ఒక్కరే ఉన్నారని తెలుసుకొని పక్కా వ్యూహంతో కిరాతకంగా హత్య చేయడం దారుణమన్నారు. రెండు రోజుల్లో ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే కోర్టుకి వెళ్తామని జగన్ స్పష్టం చేశారు.