అబ్బాయి దెబ్బ.. బాబాయ్ అబ్బా

 

అబ్బాయ్ ముద్దొస్తున్నాడని చంకన వేసుకుంటే చెవులు కొరికేసాడట. ఇదే రీతిలో బాబాయ్ వివేకానందరెడ్డికి జరిగిందట. అన్న వైఎస్ అంటే వల్లమాలిన అభిమానం వివేకాకు.. రాముడు వనవాసానికి వెళ్తే.. ఆయన పాదరక్షలు సింహాసనంపై ఉంచి పాలించిన భరతుడు టైపులో అవకాశం దక్కి ఉంటే వివేకా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత అన్నయ్య బొమ్మ పెట్టి పాలించేవాడే. అన్న మనోడే అయినంత మాత్రాన అబ్బాయి కూడా తనోడే అవుతాడనుకోవడం పొరపాటే అని చింతిస్తున్నాడు వివేకానందరెడ్డి.

 

అన్న ఉన్నప్పుడే అన్యాయం

అన్నీ తానే అనుకుని నమ్ముకున్న అన్న ఉన్నప్పుడే వివేకాకు అన్యాయం జరిగింది. అబ్బాయి మొదటి దెబ్బకు బాబాయ్ అబ్బా! అని వాపోయాడు. అన్న కొడుకు జగన్ కోసం తన పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేసిన వివేకా.. వైఎస్ మరణానంతరం తప్పనిసరి స్థితిలో కాంగ్రెస్ లో చేరాడు. అమ్మ అన్నం పెట్టదు. అడుక్కొనీ తిననివ్వదన్నట్లు జగన్ వ్యవహరించడంతో వైఎస్ ఫ్యామిలీ పొలిట్రిక్స్ లో వివేకా ఒంటరి అయిపోయాడు. కాంగ్రెస్ లో ఉంటూ వదిన విజయమ్మపై పోటీ చేసి వైఎస్ అభిమానులు, బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అడ్డంకులు అధిగమించేందుకు తప్పనిసరి అబ్బాయి పంచన మళ్ళీ చేరాడు.

 

బాబాయి అయినా ..

జగన్ జైలులో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లి భంగపడిన వివేకా..అవమానభారంతో ఉన్నా ఇతర పార్టీల్లో చేరలేని పరిస్థితి. అబ్బాయి జగన్ కడప జిల్లా పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ల పందేరం పూర్తి చేశాడు. బాబాయ్ కి నో టికెట్..నో సీట్... పోనీ పార్టీ పదవుల్లో ఏమైనా అవకాశం ఇస్తాడా అనుకుంటే అదీ లేదు. ఒకప్పుడు జగన్ అభిమానులు అడ్డగించిన సందర్భంలో మీసం మెలేసి తొడగొట్టిన బాబాయ్.. ఇప్పుడు అబ్బాయి కొట్టిన దెబ్బకు రాజకీయరంగం నుంచి ఏకంగా కనుమరుగైపోయే పరిస్థితి. పాపం బాబాయ్!