జగన్‌కి పండగే పండగ

 

ఇంత గొప్ప రాజకీయ వ్యవస్థ వున్న దేశంలో పుట్టినందుకు మనం ఎగిరి గంతేయాలి. మనల్ని మనం అభినందించుకుంటూ ఇతర దేశాలని ఎటకారంగా చూడాలి. మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే ఈ పుణ్యభూమిలోనే పుట్టాలని కోరుకోవాలి. నీకు మరో జన్మ లేదు... హ్యాపీగా స్వర్గంలోనే ఎంజాయ్ చేయ్ అని దేవుడు చెప్పినా, ఆయన్ని ఎదిరించి మరీ మళ్ళీ ఈ దేశంలోనే పుట్టాలి. 2 జీ స్కామ్‌లో లక్షల కోట్లు మింగినవాళ్ళందరూ నిర్దోషులు అని తీర్పు వచ్చేసింది. న్యాయం, ధర్మం ఇలా ఎనిమిది కాళ్ళమీద అష్టావక్రంగా నడుస్తున్న ఈ దేశంలో మళ్ళీ మళ్ళీ పుట్టాలని, చస్తూ బతికి, చచ్చాక మళ్ళీ పుట్టాలని కోరుకోవడం సగటు భారతీయులుగా మన కర్తవ్యం. 2 జీ స్కామ్‌ని ఇంత విజయవంతంగా క్లోజ్ చేసిన మోదీ సర్కారుకి జేజేలు పలకడం మనందరి కనీస బాధ్యత. నిన్న మొన్నటి వరకూ 2జీ స్కామ్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అతి పెద్ద ఘోరం, నేరం అని మొత్తుకుని ఓట్లు సంపాదించిన బీజేపీ అండ్ మోదీ ఇప్పుడు సదరు స్కామ్ నిందితులందర్నీ సగౌరవంగా బయటకి పంపించడం ఎంతో అభినందించాల్సిన విషయం. అదేంటి... 2జీ స్కామ్‌ దోషులని నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు కదా.. మధ్యలో బీజేపీకి, మోదీకి ఏంటీ సంబంధం అనుకుంటున్నారా? మీరు నిజంగా అలా అనుకుంటూ వుంటే ఈ వీడియో ఇక్కడే క్లోజ్ చేసేయండి. ఏ గాసిప్స్ వీడియోలో చూసుకుంటూ సగటు భారతీయుడిలా ఎంజాయ్ చేయండి. మీ రాజకీయ పరిజ్ఞానానికో నమస్కారం.

 

మళ్ళీ పాయింట్లోకి వెళ్దాం. తమిళనాడులో శశికళని జైల్లో వేయించిన మోదీ అన్నాడీఎంకేని దువ్వే ప్రయత్నం చేశాడు. వాళ్ళు తమ బుట్టలో పడకపోయేసరికి డీఎంకే మీద కన్నేశాడు. వందేళ్ళకు అటూ ఇటుగా వుండి... వయసు మీదపడటం వల్ల సహజంగా వచ్చే అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి మీద మోదీ సాబ్‌కి కరుణ పొంగుకొచ్చింది. చెన్నై వెళ్ళి మరీ ఆయన్ని పరామర్శించేశారు. అప్పుడే 2జీ స్కామ్ విషయంలో ఏదో జరగబోతోందని రాజకీయ పరిశీకులందరికీ డౌటొచ్చేసింది. ఇప్పుడాడౌటు కర్టక్టేనని క్లారిటీ వచ్చింది. 2జీ స్కామ్ అటక ఎక్కిన దరిమిలా ఒక హిందుత్వ పార్టీ, హిందుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ మధ్య స్నేహం భవిష్యత్తులో ఏరకంగా వుంటుందో మనం చూసి తరించే అవకాశం వుంది.

 

ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనేది నెగటివ్ సామెత... 2జీ స్కామ్‌ వచ్చిన తీర్పు చూసి జగన్ పండగ చేసుకుంటున్నాడనేది లేటెస్ట్ పొలిటికల్ సామెత. నిన్నటి వరకూ తన అవినీతి, అక్రమాల కేసుల పుణ్యమా అని ఎప్పుడు జైల్లో పడాల్సి వస్తుందా అని బిక్కుబిక్కుమంటూ వున్న జగన్‌కి 2జీ స్కామ్ తీర్పు నెత్తిన పాలు పోసింది. మోదీ వున్నాడు నువ్వేం భయపడకోయ్ జగన్ అని ధైర్యం చెప్పింది. అందుకే అలా తీర్పు వచ్చిందో లేదో ఇలా జగన్ ముఖం వెలిగిపోవడం ప్రారంభమైంది. మనిషి ముఖంలో అంతకు ముందు లేని ఆత్మవిశ్వాసం కనిపించింది. మాటల్లో దూకుడుతనం పెరిగింది. తన చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి కుర్చీ వాస్తవరూపం దాల్చబోతోందన్న నమ్మకం కనిపించింది. 2జీ స్కామ్ దోషులు కావచ్చు... జగన్ లాంటి ఆర్థిక నేరగాళ్ళు కావచ్చు... ఇలాంటి వాళ్ళు తమ మీద వున్న కేసుల్లోంచి బయటపడితే గతంలో అయితే మనం బాగా ఆశ్చర్యపోయేవాళ్ళం. భవిష్యత్తులో అలా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే మనది భారతదేశం కదా!