పవన్ మళ్లీ మళ్లీ అదే తప్పు... పార్టీ బ్రతకాలని లేదా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? తను తడబడుతూ తన వెంట నడుస్తున్న జనసైనికులను అయోమయానికి గురి చేస్తున్నాడా?. జనసేన ఆవిర్భావం నుండి తాజా రాజకీయ పరిస్థితులు వరకు ఆయన అడుగులు గమనిస్తే అవుననే అభిప్రాయం కలుగుతోంది. సినిమాలకు కామా పెట్టి 2014 లో సొంతంగా జనసేన పార్టీని స్తాపించాడు. సినిమాల్లో ఆయనను ఎంతగానో ఆదరించిన యువత.. రాజకీయాల్లో కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపారు. ఆ సమయంలో పవన్ పోటీ చేస్తే గౌరవ ప్రదమైన సీట్లు గెలిపించే అంత ఉత్సాహం చూపించారు జన సైనికులు. కానీ, పవన్ మాత్రం మొదటి అడుగులోనే వారి ఉత్సాహానికి బ్రేకులు వేసాడు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అంటూ.. ఎన్నికల బరిలోకి దిగకుండా.. బీజేపీ-టీడీపీ పార్టీలకు మద్దతు తెలిపాడు. దీంతో సగం మంది జనసైనికులు నిరుత్సాహ పడ్డారు. మిగతా వారు పవన్ చెప్పినట్టు.. బీజేపీ-టీడీపీ పార్టీలకు ఓటేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. దీంతో జనసైనికులు అది తమ విజయంగానే భవిస్తూ ఆనంద పడ్డారు. కానీ దానివల్ల జనసేనకు ఒరిగినదేమీ లేదు. బరిలోకి దిగకపోయేసరికి అదో రాజకీయ పార్టీగా ప్రజలు గుర్తించలేదు. పార్టీ గానీ, పవన్ గానీ ప్రజల్లోకి వెళ్ళలేదు.

2014 ఎన్నికల తరువాత కొన్నాళ్ళకు బీజేపీ-టీడీపీ పార్టీలకు పవన్ దూరం జరిగాడు. ప్రశ్నించడం మొదలు పెట్టాడు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో సంబంధం లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు. కానీ తాను టీడీపీ, బీజేపీ పార్టీలకు మిత్రుడు అనే ముద్ర పోగొట్టుకోలేకపోయాడు. వైసీపీ నేతలు పవన్ టీడీపీ రహస్య మిత్రుడు అంటూ ఆరోపిస్తుంటే .. పవన్ ఆ ఆరోపణలకు చెక్ పెట్టలేకపోయాడు. అది పవన్ కి బాగానే నష్టం చేసింది. ఎంతలా అంటే.. పార్టీ గెలవడం మాట అటుంచితే.. పవన్ పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం మూట గట్టుకున్నాడు. పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పవన్ కి రాజకీయాల్లో అంతటి దారుణమైన ఓటమి ఎదురుకావడానికి ప్రధాన కారణం.. పవన్ కి స్పష్టమైన స్టాండ్ లేదని ప్రజల్లో భావన కలగడమే. పవన్ బీజేపీ-టీడీపీ పార్టీల వ్యక్తిగానే ఎక్కువ మంది భావించారు. అందుకే పవన్ ని పట్టించుకోలేదు. అయినా వీటి నుండి పవన్ పాఠాలు నేర్చుకున్నట్టు లేడు. అందుకేనేమో మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు.

పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళాడు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాని కలిశాడు. ఏపీలో జనసేన-బీజేపీ కలిసి పనిచేయాలని పరస్పరం అంగీకారానికి వచ్చాయని అంటున్నారు. దీంతో జనసైనికుల్లో అయోమయం, అసహనం నెలకొన్నాయి. పవన్ ఓడిపోయినా ఇంకా ఆయన వెంట ఎందరో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రజాసమస్యల మీద పోరాడుతూ, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే.. ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. కాస్త ఆలస్యమైనా ఆయనపై ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ మాత్రం తప్పటడుగులు వేసి ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన బీజేపీ గొడుగు కిందకు చేరితే.. ఆయనకంటూ ఓ స్టాండ్ లేదని ప్రజలు అనుకుంటారు. ఈ అయోమయంలో మరికొందరు జనసైనికులు కూడా దూరం అవుతారు. మరి పవన్ ఇప్పటికైనా ఇలా ఏదోక పార్టీతో జతకట్టడం మానేసి.. తన పార్టీ తరపున ప్రజాసమస్యలపై పోరాడుతూ.. జనసైనికులకు భరోసా, ప్రజలకు నమ్మకం కలిగిస్తారేమో చూద్దాం.