వెరీ వెరీ టెంప్టింగ్ ఆఫర్... టెక్స్ టైల్ సిటీ!


మొన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సభ పెట్టి మరీ ప్రత్యేక హోదాపై గొంత విప్పటంతో ఇప్పుడు అందరి చర్చా స్పెషల్ స్టేటస్ పైకి వెళ్లిపోయింది. అదొస్తే ఏంటి లాభం? చాలా రకాల ట్యాక్స్ బెనిఫిటి్స్ వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. ఇదీ ప్రత్యేక హోదా సారాంశం. అయితే, త్వరలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందో లేదో కాని... ఇంచుమించు అలాంటి లాభాలే వున్న ఒక పరిణామం మాత్రం చోటు చేసుకోనుంది!. రాష్ట్ర విభజనతో కనీసం రాజధాని కూడా లేకుండా తన ప్రయాణం మొదలు పెట్టిన ఆంధ్రప్రదేశ్ మెల్లెమెల్లగా అడుగులు వేస్తుంది. అయితే, ఆర్దికాభివృద్ధి మాత్రం చంద్రబాబు సర్కార్ కి పెద్ద సవాల్ గా మారింది. భారీ ప్రాజెక్ట్ లు ఏవీ ఇప్పటి వరకూ రాలేదు. అందుకే, ఆంద్రప్రదేశ్ ప్రజలు, నేతలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కాస్త గుర్రగా వున్నారు. వాళ్ల అలకని తగ్గించే భారీ ప్రాజెక్టే టెక్స్ టైల్ సిటీ!


ఏపీకి టెక్స్ టైల్ సిటీ ఇవ్వాలని మోదీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ టెక్స్ టైల్ మినిస్టర్ స్మృతీ ఇరానీ ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించింది. బాగా ఎక్కువగా కార్మికులు అవసరమయ్యే టెక్స్ టైల్ ఇండస్ట్రీ నవ్యాంధ్రకి రావటం మామూలు విషయం కాదు. దీని వల్ల భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం వుంటుంది. అంతే కాదు, టెక్స్ టైల్ సిటీ అంటే ఏదో చిన్నా చితకా ఆఫర్ కాదు. కొన్ని వేల ఎకరాల్లో విస్తరించబడి వుండే తయారీ వ్యవస్థ. ఇంత పెద్ద మొత్తంలో టెక్స్ టైల్ కంపెనీలు రాష్ట్రానికి వస్తే ఆర్దికాభివృద్ధి అమాంతం పుంజుకుంటుంది.          


టెక్స్ టైల్ పరిశ్రమలు రావటమే కాదు వాటితో పాటూ ఇతర అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. వాటిలో కూడా మళ్లీ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఇలా ఎలా చూసుకున్నా టెక్స్ టైల్ సిటీ కారణంగా వేలాది ఉద్యోగాలు రావడం ఖాయమే. ఒక్క మాటలో చెప్పుకుంటే, టెక్స్ టైల్ సిటీ ఆగమనంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖచిత్రం మారిపోనుంది. ఇది నిజంగా తెలుగు వారికి శుభ పరిణామమే!