భారత్ పై దాడి లక్ష్యంగా భూగర్భ సొరంగాలు నిర్మిస్తున్న పాక్

 

పాకిస్తాన్ అణు ఆయుధాలను నిల్వ చేయడానికి భూగర్భ సొరంగాలను నిర్మిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, అమృత్సర్ నుండి 350 కిలోమీటర్లు, భారత రాజధాని న్యూఢిల్లీ నుండి 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయన్వాలీలో పాకిస్తాన్ భూగర్భ సొరంగాలను తవ్విస్తుంది. ఈ అనుసంధానిత సొరంగాల ఎత్తు 10 మీటర్లు మరియు వెడల్పు 10 మీటర్లు అని సమాచారం. ప్రతి సొరంగానికి ప్రత్యేక ప్రవేశ మరియు నిష్క్రమణ ద్వారములు ఉన్నాయట.

 

వైయాన్ అనే వార్తా సంస్థ నివేదిక ప్రకారం, అణు క్షిపణులను ప్రయోగించే ప్రదేశానికి సులువయిన రవాణా కోసం, పాకిస్తాన్ యొక్క భూగర్భ సొరంగాలు విస్తృత రహదారులకు అనుసంధించారట. అయితే, ఈ సొరంగ మార్గాలు నిర్మిస్తున్న ప్రదేశంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ ప్రదేశం చుట్టూ భారీ కంచెలు నిర్మిస్తున్నారు. ప్రతి సొరంగం 12 నుండి 24 అణ్వాయుధాలను నిల్వ చేయగల సామర్ధ్యం కలిగి ఉంటాయని తెలిసింది.

 

పాక్ అణు శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ తమ దేశం ఢిల్లీలో 5 నిమిషాల్లో అణు దాడిని ప్రారంభించగలదు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

ఇదిలా ఉంటే,  సెప్టెంబరులో జమ్మూ - కాశ్మీర్లోని ఆర్నీయా విభాగంలోకి, పాకిస్థాన్ వైపు నుండి వస్తున్న భూగర్భ సరిహద్దు సొరంగం బయటపడింది. అంతర్జాతీయ సరిహద్దుల వెంట శాంతి నెలకొల్పేందుకు సుచేట్గర్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) మరియు పాకిస్తానీ రేంజర్స్ చర్చలు జరిపిన ఒక రోజు తర్వాత ఈ సొరంగం బయట పాడడం విశేషం.

 

గత సంవత్సరం ఒక అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణు ఆయుధాల నిల్వలను మరియు క్షిపణి సరఫరా సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. పాకిస్తాన్ 140 అణ్వాయుధాల నిల్వలు కలిగి ఉందని ఆ సంస్థ నివేదించింది.

 

అయితే, పాకిస్తాన్ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత్ ముందు తన పప్పులు ఉడకవని. 1947, 1965, 1971, మరియు 1999 ల్లో జరిగిన యుద్దాల్ని, అప్పుడు తగిలిన గాయాల్ని అప్పుడే మరచిపోయినట్టున్నారుగా!