రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు... డిఫెన్స్ లో వైసిపి

అమరావతి రాజధానిపై వైసీపీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓటమి తర్వాత కూడా అమరావతి కోసం అన్ని అప్పుల అవసరమా అని మాజీ సీఎం జగన్ అక్కసు వెళ్లగక్కారు. వైసీపీ మీడియా రంగంలోకి దిగింది. అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా  ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  జూన్ 4న  వెన్నుపోటు దినంతో ఏదో సాధించామని సంబరపడిపోతున్న వైసీపీ శ్రేణులను ఆ పార్టీ మీడియానే ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లోకి నెట్టేసింది. మీడియాలో జర్నలిస్టు ముసుగులో జరిగిన చర్చపై కూటమి ప్రభుత్వం చర్యలకు  సిద్ధమైంది. రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలతో మహిళలను అవమానించారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైఃసీపీ సొంత మీడియాలో ఓ చర్చ సందర్భంగా అమరావతి ప్రాంత మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఉపముఖ్యమంత్రి ఖండించారు. రాజధానిపై కుట్రలు చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

జర్నలిస్ట్ ముసుగులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రజలు, అధికారులు విశ్లేషించాలని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ సదరు ఛానల్‌ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కులముద్రలు వేసి మహిళలను అవమానిస్తున్నారంటూ ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక్కడ విలసిల్లిన బౌద్ధాన్నీ అవహేళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతానికి బలమైన చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ ధర్మ నేపథ్యం ఉన్న విషయాన్ని విస్మరించవద్దని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32 శాతం ఎస్సీ, ఎస్టీ.. 14 శాతం బీసీ రైతులు ఉన్నారని వివరించారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు చెందిన మీడియాలో చర్చ కార్యక్రమం వేదికగా చేసిన కామెంట్లు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను.. ఈ ప్రొగ్రామ్‌లో కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా..   వ్యంగ్యంగా కామెంట్ చేయడంపైనా పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఆ మీడియా యాజమాన్యం సైతం దీనిని సమర్థించుకొనే విధంగా.. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పెద్దఎత్తున ఉద్యమ బాట పట్టారు.  అలాంటి వేళ ఆ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత వరుసగా స్పందించారు. మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీపీ ఫిర్యాదు చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu