తెదేపా, వైకాపాలకు హైదరాబాద్ తో కాంగ్రెస్ చెక్ పెడుతుందా

 

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇరు ప్రాంత ప్రజలకు అమోదయోగ్యమయిన విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోబోతున్నట్లు రక్షణ శాఖ మంత్రి ఎకె అంటోనీ సీమాంద్ర నేతలతో అన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీమంధ్రలో ప్రజలు, ఉద్యోగులు, పార్టీలు విభజనను వ్యతిరేఖిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్నపటికీ, హైదరాబాద్ విషయంలో వారికి అనుకూలమయిన నిర్ణయం జరిగితే వారు శాంతించే అవకాశం ఉందని, అదేవిధంగా హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు, ప్రజల భయాందోళనలు పోగొట్టేందుకు కూడా ఇదే సరయిన పరిష్కారమని కేంద్రం ఆలోచిస్తున్నట్లుంది.

 

అయితే, అందుకు టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస ఇతర తెలంగాణావాదులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోరని కేంద్రానికి తెలియకపోలేదు. కానీ, తెలంగాణా ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు ప్రతిగా, ఈ తాత్కాలిక ప్రతిపాదనకు అంగీకరించమని కాంగ్రెస్ కోరవచ్చును. తద్వారా రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయగలిగే అవకాశముంటుందని వారికి కేంద్రం నచ్చజెప్పి, తనకు సహకరించవలసిందిగా కోరవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీ తెరాసను తనలో విలీనం చేసుకోగలిగితే తన నిర్ణయాలను అమలుచేయడానికి పెద్దగా శ్రమ పడనవసరం లేదు. కానీ విలీనం అంత సులువు కాదు. విలీనం జరిగినా, జరుగకపోయినా కేంద్రం వారి కొన్ని డిమాండ్లకు అంగీకరించి వారిచే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు అంగీకరింపజేసే అవకాశముంది.

 

అదే జరిగితే, తమ హక్కులు, భద్రత గురించి నిరవధిక సమ్మె చేస్తున్నఏపీ యన్జీవోలు కూడా వెనక్కి తగ్గే అవకాశముంది. దానితో ‘సమైక్యం-సమన్యాయం’ అంటూ ఉద్యమిస్తున్న తెదేపా, వైకాపాలు కూడా తమ ఆందోళనలు నిలిపివేయక తప్పదు. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలించే అంశం.

 

ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇంతా కాలం ఎందుకు జాప్యం చేసిందంటే, ముందే ఈ ప్రకటన చేసి ఉంటే, తెదేపా, వైకాపాలు ఈవిధంగా సమైక్య ఉద్యమాలు చేసేవి కావు, వైకాపా తెలంగాణాను వదులుకొనేది కాదు. పైగా ఆ రెండు పార్టీలు మరో సరికొత్త వ్యూహంతో, కొత్త డిమాండ్ తో తమను ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఒకప్పుడు తెలంగాణకు అనుకూలమని లేఖలు ఇచ్చిన వైకాపా, తెదేపాలను ఇంత కాలం సమైక్య ఉద్యమాలు చేయనిచ్చితమ వేలితో తమ కళ్ళు పొడుచుకొనేలా చేయడమే కాకుండా, ఇంతకాలం పాదయాత్రలు, బస్సు యత్రలతో ఇబ్బంది పెడుతున్న ఆ రెండు పార్టీల నేతలని ఈ నిర్ణయంతో చావు దెబ్బ తీయగలదు.

 

తెలంగాణా ఏర్పాటు చేసిన కారణంగా తెలంగాణా ప్రజల ఓట్లను, సీమంధ్ర ప్రజల ఒత్తిడికి లొంగి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కారణంగా సీమంధ్ర ప్రజల ఓట్లను కూడా దండుకోవచ్చునని కాంగ్రెస్ ఆలోచన. అదేవిధంగా నెలరోజులపైగా ఉద్యమాలు చేస్తున్నసీమంధ్ర ప్రజల అహం చల్లార్చి, వారికి తాము కేంద్రం మెడలు వంచామనే తృప్తి కలిగింపజేసి అంతిమంగా వారిచే గౌరవప్రదంగా ఉద్యమం విరమింపజేసేందుకే ఈ జాప్యమని భావించవచ్చును. అందుకే సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎంత తీవ్రంగా సాగుతున్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం దైర్యంగా తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడుతోంది.

 

ఇక, తెలుగు ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఆలోచించుకొనే వ్యవధి ఈయకూదదని కాంగ్రెస్ భావిస్తే ఈనెలలో లేదా వచ్చేనెలాఖరులోగానో మధ్యంతర ఎన్నికల ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో రెండుప్రాంతలలో పరిస్థితి తనకనుకూలంగా మారినట్లయితే కాంగ్రెస్ డిశంబర్ లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో బాటు ఇక్కడ కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు.