బోనాల్లో కరోనా.. 40మందికి వైరస్

అమ్మ వారికి భక్తితో బోనమ్. ఉగాదికి ముందు అనేక ప్రాంతాల్లో బోనాలు చేస్తున్నారు భక్తులు. అలానే ఆ కాలనీ వాసులు కూడా ఇటీవల బోనాలు చేశారు. చుట్టాలు, స్నేహితులను పిలిచి ఘనంగా వేడుక జరుపుకున్నారు. అంతా ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. 

కట్ చేస్తే.. ఆ కాలనీలో ఒకరికి అస్వస్థత. జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాడు. అనుమానంతో కొవిడ్ టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. ఇక అంతే, ఆ కాలనీ వాసులంతా హడలిపోయారు. విషయం అధికారులకు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది ఆ కాలనీ మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించింది. 70మందికి టెస్టులు చేస్తే అందులో 40మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో.. టెస్టులు పెంచుతున్నారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. 

ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల ఎస్సీ కాలనీలో జరిగింది. ఒక చిన్న కాలనీలో ఏకంగా 40మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల జరిగిన బోనాలకు హాజరైన వారందరికీ కరోనా టెస్టులు చేయిస్తోంది. అందరినీ హౌజ్ క్వారంటైన్ చేసింది. మల్యాల ఎస్సీ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు.   

ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయినా, జనాలు కొవిడ్‌ను పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. బోనాలు, సినిమాలు, షాపింగ్ అంటూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. సామూహిక వేడుకల్లో పాల్గొంటున్నారు. జగిత్యాల జిల్లాలో అదే జరిగింది. మల్యాల ఎస్సీ కాలనీలో బోనాల పేరుతో ప్రజలు పండగ జరపడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జనాలు.. ఇప్పటికైనా జర జాగ్రత్త.