గోవు నిజంగా కామధేనువే..!
posted on Jun 29, 2016 2:52PM
.jpg)
భారతీయ సంస్కృతిలో..చరిత్రలో గోవుకు ప్రత్యేక స్థానముంది. అనాది నుంచి గోవు భారతీయులకు ఆరాధ్య దేవత. ఆ తల్లి కరుణా కటాక్షాలతో సకల సంపదలతో మన భారతావని పూర్వం అత్యంత వైభవంగా విరాజిల్లింది. సకల వేదాలు, పురాణాలు, శాస్త్రాలు గోమాతను కొనియాడాయి. గోవును ప్రత్యక్ష దైవంగా ఈ దేశం స్వీకరించింది. గోవును నడిచే దేవాలయంగా మన పెద్దలు నిర్వచించారు. గోవు మూత్రానికి అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉందని మన రుషులు ఎనాడో చెప్పారు. దీనిపై పరిశోధనలు జరిపిన శాస్త్రజ్ఞులు గోమూత్రంలో 47 రకాల మూల పదార్ధాలున్నాయని మన మహర్షులు చెప్పిన మాటలు అక్షరసత్యాలని నిరూపించారు.
ఇక తాజాగా జరిపిన మరో పరిశోధనలో ఆవును కామధేనువని ఎందుకంటారో తెలిపే నిజం వెలుగు చూసింది. 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై గుజరాత్‌లోని జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ పరిశోధనలు చేసింది. మూత్రం నమూనాలను పరీక్షించగా లీటర్ మూత్రంలో మూడు నుంచి 10 మిల్లీ గ్రాముల బంగారం ఉన్నట్లు బయటపడింది. ఆయాన్ల రూపంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
గో మూత్రంలో బంగారం ఉంటుందని పూర్వీకులు చెప్పగా వినడమే తప్ప ఇంతవరకు శాస్త్రీయంగా నిర్థారణ కాలేదు..అందుకే ఈ విషయాన్ని తేల్చేందుకే తామీ పరిశోధన చేపట్టినట్టు పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ బీఏ గొలాకియా పేర్కొన్నారు. ఒంటెలు, గేదెలు, గొర్రెలు, మేకల మూత్రంపైనా పరిశోధనలు చేయగా అందులో యాంటీ బయోటిక్ పదార్ధాలు కనిపించలేదన్నారు. ఆవు గొప్పతనం నలుదిశలా వ్యాప్తి చెందడం శుభపరిణామం. దీని వల్ల ఇకపైనైనా గోవుల సంరక్షణ చేపట్టే అవకాశం ఉంది.