కలలోకి వచ్చాడని..హీరో శ్రీకాంత్‌పై దాడి

ప్రముఖ తెలుగు సినీ నటుడు శ్రీకాంత్‌పై సైకో దాడికి పాల్పడ్డాడు. నిన్న శ్రీకాంత్ ఇంట్లోకి ప్రవేశించిన శ్రీకాంత్‌ను వాచ్‌మెన్‌ అడ్డుకోవడంతో అతన్ని కొట్టి..అక్కడ పార్క్ చేసి ఉన్న రెండు కార్లను ధ్వంసం చేయడంతో పాటు కారు డ్రైవరుపై దాడి చేసి పై అంతస్థు మీదకు పరుగు తీశాడు. ఆ సమయంలో మేడ దిగి వస్తున్న శ్రీకాంత్‌ను మెట్లపై నుంచి తోసేశాడు. అయితే ఆయనకు కొద్దిలో ప్రమాదం తప్పింది. వాచ్‌మెన్, డ్రైవర్ సమాచారంతో అక్కడి చేరుకున్న పోలీసులు..సైకోని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా వారిపైనా దాడికి ప్రయత్నించాడు.

 

అత్యంత కష్టంతో పోలీసులు సైకోని అరెస్ట్ చేశారు. విచారణలో అతన్ని కర్నూలు జిల్లాకు చెందిన వెంకటేశ్‌‌గా గుర్తించారు. అతను హైదరాబాద్‌లోని పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో వంటమనిషిగా పనిచేశాడు. దీనిలో భాగంగా శ్రీకాంత్ దగ్గర కూడా పనిచేశాడు. అయితే అతని పనితీరు బాగోలేకపోవడం..ఉన్మాదిలా కనిపించడంతో పనిలోంచి తొలగించారు. అయితే కొద్ది రోజులుగా శ్రీకాంత్ తనకు కలలోకి వస్తున్నాడని..ఎన్నిసార్లు ఆయన్ను కలిసేందుకు వెళ్లినా సిబ్బంది అనుమతించనందున ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. విచారణ అనంతరం అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.